రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందచేయండి: జగన్

గోదావరి వరద ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తెలిపారు. గోదావరిలో వరద నీరు పెరగడంతో ప్రభావితమైన గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటు అదనంగా ఆయా కుటుంబాలకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు ఈ సహాయం కూడా అందనుంది. ఇళ్లు, పంట నష్టపోయినా నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకనే ప్రత్యేకంగా ఈ రూ.5వేలు సహాయం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. మానవతా దృక్పథంతో గిరిజనులను ఆదుకోవాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

Videos

1,717 thoughts on “రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందచేయండి: జగన్