అమానుషం: అమెరికాలో మారణహోమం

అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. తాజాగా చోటు చేసుకున్న దారుణం ఆ దేశ ప్రజల్ని షాక్ కు గురి చేసింది. ఉగ్రదాడికి ఏ మాత్రం తీసిపోని రీతిలో చోటు చేసుకున్న ఉదంతం అక్కడి ప్రజల్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. తుపాకీ చేత పట్టుకున్న ఒక యువకుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఉదంతంలో 17 మంది విద్యార్థులు  దుర్మరనం చెందారు. విద్యార్తుల నెత్తుటితో స్కూల్ ప్రాంగణం భీకరంగా మారింది. మృతి చెందిన కుటుంబ సభ్యులు.. స్నేహితుల రోదనలతో పరిస్థితి ఉద్వేగంగా మారింది. కాల్పుల నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పార్క్ ల్యాండ్ లోని  మార్జోయ్ స్టోన్ మన్ డగ్లస్ హైస్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చేతిలో మారణాయుధాన్ని పట్టుకొని స్కూలు ఆవరణలోకి దూసుకొచ్చిన యువకుడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. లోపలికి వస్తూనే.. గేటు వద్ద ముగ్గురుని కాల్చేసిన అతడు.. ఆ వెంటనే బిల్డింగ్ ఫైర్ అలారంను మోగించాడు.

ఆ శబ్ధంతో ఉపాధ్యాయులు మొదలు.. విద్యార్థులంతా ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. వారు బయటకు వెళ్లే ద్వారం వద్ద ఎదురుగా నిలబడిన ఆగంతుకుడు బయటకు వచ్చిన వారిని వచ్చినట్లుగా కాల్చేశాడు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 17 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన యువకుడ్ని పోలీసులు గుర్తించారు.

17 మంది నిండు ప్రాణాల్ని పొట్టనపెట్టుకున్న యువకుడు అదే స్కూల్కు చెందిన మాజీ విద్యార్థిగా గుర్తించారు. 19 ఏళ్ల నికోలస్ క్రూజ్ గా తేల్చారు. కొద్ది రోజుల కిందటే అతడు స్కూల్ నుంచి సస్పెండ్ అయినట్లు చెబుతున్నారు. . కాల్పుల అనంతరం స్కూల్లో దాక్కునే ప్రయత్నం చేయగా.. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను స్కూల్ నుంచి సస్పెండ్ చేసినందుకే ఈ మారణహోమానికి పాల్పడినట్లు పేర్కొన్నట్లు సమాచారం. అయితే.. ఇందులో నిజమెంతన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. తాజా మారణహోమంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఫ్లోరిడా గవర్నర్ కు ఫోన్ చేసి చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక.. బాధిత కుటుంబాల శోకాన్ని ఆపతరం కావటం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published.