బెంగుళూరు ఎఫెక్ట్ : జస్ట్ 20 నిమిషాలు: 36 వోల్వో, స్లీపర్ కోచ్ బస్సులు బూడిద

బెంగళూరు నగరంలో కేపీఎన్ ట్రావెల్స్ కు చెందిన 36 బస్సులు బూడిద అయ్యాయని ఆ సంస్థ వ్యవస్థాపకుడు అన్వర్ అంటున్నారు. కొందరు గుర్తు తెలియని ఆందోళనకారులు తాము పార్క్ చేసిన స్థలంలోనే వాహనాలకు నిప్పంటించి పరారైనారని విషాదం వ్యక్తం చేశారు.

1992 నుండి కర్ణాటక నుంచి తమ సంస్థ బస్సు సర్వీసులు వివిధ ప్రాంతాలకు సంచరిస్తున్నాయని చెప్పారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళకు దాదాపు 400 బస్సు సర్వీసులు నడుస్తున్నాయని అన్నారు. బెంగళూరులోని శాంతినగర సమీపంలోని డిసౌజనగరలోని ధ్వారకా నగరలో గతంలో ఎస్ఎల్ఎస్ కంపెనీ గ్యారేజ్ ఉండేది. ప్రస్తుతం 2,5 ఎకరాల స్థలంలో కేపీఎన్ కంపెనీ గ్యారేజ్ ఉంది.

ఒకటిన్నర నెల క్రితం 52 వోల్వో, స్లీపర్ కోచ్ బస్సులు కొనుగోలు చేశామని కేపీఎన్ సంస్థ అన్వర్ అన్నారు. ఇక్కడే డ్రైవర్లు, కండెక్టర్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం 25 మంది డ్రైవర్లు, కండెక్టర్లు గ్యారేజ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. గ్యారేజ్ లో అశోక లైలాండ్ కంపెనీకి చెందిన స్లీపర్ కోచ్ బస్సులు పార్క్ చేశారని ఆయన అన్నారు. ఒక్కోబస్సు రూ. 38 లక్షల నుంచి రూ. 40 లక్షలు ఉంటుందని చెప్పారు. ప్రతి బస్సులో నాలుగు అత్యాధునిక టీవీలు ఉన్నాయని వివరించారు.

అయితే కొందరు ఆందోళనకారులు బస్సుల మీద పెట్రోల్ చల్లి నిప్పంటించడంతో 36 బస్సులు కేవలం 20 నిమిషాల్లో పూర్తిగా భూడిద అయ్యాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రయాణికులు టిక్కెట్లు రిజర్వు చేసుకున్నారని అన్నారు. బస్సులు కాలిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు అసౌకర్యానికి గురైనారని, వారి టిక్కెట్ డబ్బులు తాము తిరిగి చెల్లిస్తామని అన్వర్ వివరించారు. కేపీఎన్ బస్సులు భూడిద చేశారని ఆరోపిస్తూ పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *