కళాభవన్ మణి కన్నుమూత

దక్షిణాది సినీరంగంలో వైవిధ్య భరితమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ మణి ఇకలేరు. ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కోచిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 7.15 గంటలకు తుదిశ్వాస విడిచారు.

మణి ఒకప్పుడు సాధారణ ఆటోడ్రైవర్ కావడం విశేషం. మిమిక్రీ ఆర్టిస్టుగా.. గాయకుడిగా.. ప్రస్థానం ఆరంభించి తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన మణి.. వాసంతియుం లక్ష్మియుం పెన్నె నానుమ్ (తెలుగులో శీను వాసంతి లక్ష్మి) సినిమాలో చాలా మంచి పేరు సంపాదించాడు. ఆ సినిమాకు అతడికి జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా దక్కింది.ఆ తర్వాత తమిళంలో జెమిని సినిమాతో సౌత్ ఇండియా అంతా అతడి పేరు మార్మోగిపోయింది. జెమిని తెలుగు రీమేక్ లో సైతం అద్భుత నటనతో అలరించాడు. తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించాడు. కొన్నేళ్లుగా మాతృభాష మలయాళంలో మాత్రమే నటిస్తున్న మణి.. ఇలా అనారోగ్యంతో చనిపోవడం విచారకరం. ఆయన వయసు 45 ఏళ్లు మాత్రమే.

జెమిని చిత్రంలో విలన్ లడ్డా పాత్రలో మణి ప్రదర్శించిన నటన, హావభావాలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. జెమిని చిత్రం తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ విలన్లలో ఒకరిగా మారారు. తెలుగులో ఎవడైతే నాకేంటి, నరసింహుడు, అర్జున్‌తోపాటు పలు చిత్రాల్లో నటించారు. ఆయన మంచి నటుడే కాకుండా గాయకుడు, సంగీత దర్శకుడు కూడా. 25కుపైగా చిత్రాల్లో పాటలు పాడారు. మలయాళం, తమిళం, తెలుగులో 200 చిత్రాలకుపైగా నటించారు.

Videos

Leave a Reply

Your email address will not be published.