అర్ధరాత్రి అజిత్ ప్రకంపనలు

నిన్న అర్ధరాత్రి సోషల్ మీడియాను ఒక ట్రైలర్ తుపాను లాగా తాకింది. దాని దెబ్బకు సౌత్ ఇండియన్ సినీ ప్రియులందరూ షేకైపోయారు. అది తల అజిత్ కొత్త సినిమా ‘వివేగం’ ట్రైలర్ కావడం విశేషం. ఆ మధ్య రిలీజైన ‘వివేగం’ టీజర్ ఎంతగా చర్చనీయాంశమైందో తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్ చూస్తే దానికి దీటుగానే కనిపించింది. ఇంకో వారం రోజుల్లో ‘వివేగం’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి ‘వివేగం’ ట్రైలర్ లాంచ్ చేశారు. అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గని విజువల్స్‌తో.. కళ్లు చెదిరే ప్రొడక్షన్ వాల్యూస్‌తో మతి పోగొట్టేసింది ‘వివేగం’ టీజర్.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సీక్రెట్ మిషన్ నడిపించే ఐదుగురు ఏజెంట్స్. అందులో ఒకడు ఉగ్రవాదులతో చేతులు కలుపుతాడు. అతడి కుట్ర వల్ల హీరో నేరస్థుడిగా ముద్ర వేయించుకుంటాడు. ఆ కుట్రను ఛేదించి ఉగ్రవాదులతో చేతులు కలిపిన తన మిత్రుడి ఆట ఎలా కట్టించాడన్నది ‘వివేగం’ కథలాగా అనిపిస్తోంది ట్రైలర్ చూస్తే. రెండు నిమిషాల ట్రైలర్ చూస్తున్నంతసేపూ ఆ విజువల్స్‌ నోరెళ్లబెట్టి చూడాల్సిందే. ట్రైలర్‌ను కట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. లొకేషన్స్ అదిరిపోయాయి. ఛాయాగ్రహణం.. సంగీతం.. యాక్షన్.. ఆర్ట్.. అన్నీ కూడా హై స్టాండర్డ్స్‌లో కనిపిస్తున్నాయి.

చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం అజిత్ అభిమానులకే కాక సామాన్య ప్రేక్షకులకూ బాగానే కనెక్టయ్యేలా ఉంది. అజిత్ మామూలుగా లేడిందులో. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా విందు భోజనం లాగే అనిపిస్తోంది. అజిత్‌తో ఇంతకుముందు ‘వీరం’.. ‘వేదాలం’ లాంటి మామూలు సినిమాలు తీసిన శివ.. ఈసారి మాత్రం ఓ రేంజి సినిమా తీసినట్లే కనిపిస్తున్నాడు. కాజల్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా.. అక్షర హాసన్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. సినిమా అంతా కూడా ఫారిన్ లొకేషన్లలోనే తెరకెక్కినట్లుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాతో టాలవుడ్లోకి రాబోతున్న అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. ఈ నెల 24న తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకురాబోతోందీ సినిమా.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *