ఏపీలో 7 ఎమ్మెల్సీ సీట్లు ఏకగ్రీవం! టీడీపీ-5, వైసీపీ-2

ఏపీ శాసనమండలిలో ఏడు సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ సీట్లకు జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉపాధ్యాయ – పట్టభద్రుల స్థానాలతో పాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయ – పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టల ప్రమేయం అంతగా లేకున్నా… స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం రసవత్తర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొత్తం స్థానిక సంస్థల కోటాలోని  9 స్థానాల ఎన్నికల్లో టీడీపీ పలు మార్గాల్లో ఇప్పటికే 6 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోగా… మిగిలిన మూడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ బలమెంతో తెలియనుంది. విపక్ష హోదాలో ఉన్న వైసీపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే పరిగణిస్తున్నా… అధికార పక్షంగా ఉన్న టీడీపీకి ఈ ఎన్నికలు చావో రేవో అన్న చందంగా మారాయని చెప్పక తప్పదు. తర్వలో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు పకడ్బందీ వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల్లో విపక్ష వైసీపీ అవలంబించిన వ్యూహానికి అధికార టీడీపీ చిత్తు కాక తప్పలేదు. ప్రస్తుతం ఈ కోటాలో ఎన్నికలు జరగాల్సిన 7 స్థానాలకు సంబంధించి… అసెంబ్లీలో ఇరు పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల బలం ఆధారంగా టీడీపీకి ఐదు – వైసీపీ ఒక స్థానం దక్కడం ఖాయం. మరి మిగిలిన మరో స్ధానాన్ని దక్కించుకునేందుకు ఏం చేయాలని ఇరు పార్టీలు తమదైన రీతిలో వ్యూహాలు రచించాయి. అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ముందు… వైసీపీకి దాదాపుగా70కి పైగానే ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే అధికార పార్టీ విసిరిన తాయిలాలకు లోనై వైసీపీ టికెట్లపై విజయం సాధించిన 21 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోయారు. దీంతో సభలో వైసీపీ బలం కుచించుకుపోగా… టీడీపీ బలం మాత్రం అంతకంతకూ పెరిగింది.

అయితే వైసీపీ విప్ జారీ చేస్తే… టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసే అవకాశాలు లేవు. ఒకవేళ విప్ ను తిరస్కరించి వారు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేస్తే… వారి సభ్యత్వాలు రద్దు కాక తప్పదు. ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని వైసీపీ తన బలంలో ఒక అభ్యర్థిని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నా… రెండో సీటు కోసం మరో అభ్యర్థిని బరిలోకి దింపింది. వైసీపీ ప్లాన్ అర్థమైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు… ఆరో సీటుకు పోటీ చేయాలని పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినా… ఓడిపోక తప్పదన్న సత్యాన్ని గ్రహించి తమ బలంతో గెలిచే ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు.

ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా కోస్తాంధ్ర నుంచి పార్టీ ముఖ్య నేత ఆళ్ల నాని రాయలసీమ నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డిల చేత నామినేషన్లు వేయించింది. వైసీపీ వ్యూహంపై సుదీర్ఘ మంతనాలు చేసిన చంద్రబాబు… టీడీపీ నుంచి కరణం బలరాం – డొక్కా మాణిక్య వరప్రసాద్ – బచ్చుల ఆర్జునుడు – పోతుల సునీత – తన పుత్రుడు నారా లోకేశ్ లతో నామినేషన్లు వేయించారు. కాసేపటి క్రితం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో మొత్తం ఏడు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులే బరిలో నిలిచినట్లు తేలడంతో ఎన్నికల అధికారులు ఏడుగురు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.

Videos

332 thoughts on “ఏపీలో 7 ఎమ్మెల్సీ సీట్లు ఏకగ్రీవం! టీడీపీ-5, వైసీపీ-2

Leave a Reply

Your email address will not be published.