చర్చా..రచ్చా..

కల్తీ మద్యం, కాల్‌ మనీ…ఈ శీతాకాలం సమావేశాల్లో మంటలు రేపటం ఖాయమైన వేళ…దాడి, ఎదురు దాడి, పరస్పర నిందారోణలు, దూషణ భూషణల పర్వానికి పాలక ప్రతిపక్షాలు మరి కొన్ని గంటల్లో తెరతీసి.. ఐదు కోట్ల ఆంధ్రులకు ఉచిత వినోదాన్ని పంచనున్నాయంటే అతిశయోక్తి కాదు. రోజుకు రెండు కోట్ల రూపాయల ఖర్చు పెడుతూ, ప్రజా సమస్యల్ని కూలకషంగా చర్చించి ”పరిష్కార మార్గాలు కనుక్కోండి మహాప్రభో” అని జనం వేడుకుంటుంటే… గడచిన 18 నెలల్లో శాసన సభ సాక్షిగా ఒకరినొకరు సూటీిపోటీ మాటలతో సాధించుకున్నారే గానీ, ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు. ఒకరినొకరు నిందించుకోవటంలో రికార్డు స్థాపించారంతే. ప్రతిపక్ష నేత నోరు విప్పినంతనే… ”నువ్వో దొంగవి, అవినీతిపరుడివి, 11 కేసుల్లో ప్రధాన ముద్దాయి” అంటూ పాలక పక్షం ఎమ్మెల్యేలు అన్ని సమావేశాల్లోనూ విరుచుకుపడి, తమ పార్టీ అధినేత మెప ు్ప కోసం తపిస్తున్నారనేది ఓ వాదన. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యపై సమాధానం ఇవ్వలేని స్థితిలోనే ఈ రీతి ఎదురుదాడి జరిగేది. వాస్తవానికి ప్రతిపక్ష నేత మీద ఎన్ని కేసులున్నాయనే విషయం జనానికి తెలుసు. అయినా శాసనసభ వేదికగా పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించి పాలక పక్షం సాధించిందేమిటో ప్రజలకు అర్థం కాని విషయం. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో బలమైన ప్రతిపక్షం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పరిమాణం చాల ఆహ్వానించదగిన అంశమే. కానీ, సంఖ్యా బలం ఉన్నా.. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి ప్రతిపక్ష నేతకు లేకపోవటమే ప్రధాన సమస్య. వ్యక్తిగత ఆరోపణలతో పాలక పక్షం రెచ్చగొడుతుంటే.. సంయమనం పాటించాల్సిన ప్రతిపక్షమూ తొడలుగొట్టి, మీసాలు తిప్పుతూ బస్తీమే సవాల్‌ అంటూ రచ్చకు దిగి… సభ సంప్రదాయాలు పాటించటంలేదనే అపవాదునూ మూటగట్టుకుంటోంది. అధికార పార్టీ మద్దతుతో స్పీకర్‌ కుర్చీని ఎవరు ఎక్కినా.. ప్రతిపక్షం గొంతు నొక్కటం సర్వసాధారణమే. ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోయి ప్రతిపక్ష నేత ప్రతిసారీ స్పీకర్‌తో ఘర్షణకు దిగుతున్నారు. ఇలా ప్రతిపక్ష నేత బలహీనతలను అడ్డుపెట్టుకుని ఇంత వరకూ పాలక పక్షం తప్పించుకుంటోంది. ఐతే, ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు ముందే తెరమీదకు వచ్చిన కల్తీ మద్యం, కాల్‌మనీ, బాక్సైట్‌ తవ్వకాల జీవో, కరవు, వరదల నష్టాలపై నిజంగానే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉంది. నిజానికి సమాజాన్ని కుంగదీస్తున్న కల్తీ మద్యం, కాల్‌ మనీ రుగ్మతలకు అసెంబ్లీ సాక్షిగా శాశ్వత పరిష్కారాలను చర్చించాల్సిందే. ఆదాయంలేక ఖాళీ ఖజానాతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత అత్యవసర రొక్కాన్ని ఇచ్చేది మద్యం వ్యాపారమే. ఈ ఏడాది కనీసం రూ.16 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే పాడిపశువుగా మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం భావిస్తోంది. జనం ఎంతగా తాగితే అంత ఆదాయం వస్తుందనే అత్యాశతోనే రాత్రింభవళ్లు కూలీనాలీ జనం గొంతులో పచ్చి విషాన్ని పోస్తోంది. ఆదాయం కోసం ప్రభుత్వమే అంతగా సాగిల పడే సరికి మద్యం వ్యాపారులు కల్తీకి దిగారు. ఐతే, బెజవాడలో ఐదుగురు అమాయకులు మృతి చెందిన తరువాత కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. రాజకీయం కోసమా? ప్రజల కోసమా? అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ప్రతిపక్షనేత సంపూర్ణ మద్య నిషేధాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. వామపక్ష పార్టీలు కూడా సంపూర్ణ మద్య నిషేధాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఖజానాను నింపేందుకే ఈ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న పాలకులు… ఓ అనారోగ్య సమాజానికి పునాది వేసి, రాష్ట్రాభివృద్ధికి సమాధి కడుతున్నామనే నిజాన్ని గ్రహించటం లేదు. సింగపూర్‌, బాంకాక్‌ల తరహాలో అభివృద్ధిని కోరే పాలకులకు… ఆరోగ్య సమాజంతో నిలకడ అభివృద్ధి సాధించవచ్చనే
విజన్‌ లేకపోవటమే ఇందుకు కారణం. కనీసం శాసన సభలో అటు అధికార పక్షం, ఇటు పాలక పక్షం శషబిషలకు తావివ్వకుండా… మద్య నిషేధంపై ఏకాభిప్రాయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌ ఆడపడచుల ఆనందానికి అవధులు ఉండవు. అంతే కాదు, సంపూర్ణ ఆరోగ్యంతో మానవవనరులు సద్వినియోగం జరిగితే, సీఎం కోరే రెండెంకల అభివృద్ధి సుసాధ్యమే. ఇక కాల్‌మనీ వ్యవహారంలో… ఏ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారన్నది ప్రధాన సమస్య కాదు. ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం. స్వయం ఉపాధికి ఆర్థిక సాయం చేసే వ్యవస్థలు మనకు లేవు. ఓ బీసెంట్‌ రోడ్డులో ఇడ్లీలు అమ్ముకునే ఓ చిరువ్యాపారికి కేవలం రెండువేల రూపాయలుంటే చాలు… తన రోజువారీ వ్యాపారానికి మదుపు చేసుకోగలడు.
ఇంత సొమ్మును రుణంగా ఇచ్చే ప్రభుత్వ వ్యవస్థలేవీ? పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల ఇళ్లకు వెళ్లి మరీ వేల కోట్ల రుణాలిచ్చే బ్యాంకులు బీసెంట్‌ రోడ్డులోని చిరు వ్యాపారి ఓ డిఫాల్టర్‌గా కనిపిస్తాడు. ఒకవేళ బ్యాంకుకు వెళ్లి రుణం అడిగితే సవాలక్ష హామీలు అడుగుతారు. అందుకే ఇలాంటి చిరువ్యాపారులు కాల్‌మనీ వ్యాపారుల వలకు చిక్కుతున్నారు. కనీసం ఈ సమావేశాల్లో నైనా ఇంలాంటి బడుగుల దైన్య స్థితిపై అర్థవంతమైన చర్చ జరగాలి. ఇక బెజవాడ కాల్‌మాఫియాపై ఉక్కుపాదం మోపాలి. అందుకు చర్యలు తీసుకోవాలి. అంతేగానీ, మా పార్టీ నాయకులే కాదు, మీ పార్టీ నాయకులు ‘కాల్‌నాయక్‌’లే అని నిరూపించే వృధా ప్రయాసకు ప్రభుత్వం దిగటం సబబు కాదు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక రుగ్మతగా అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షమూ లోతుగా చర్చించాలి. రాష్ట్రంలో కరవు పరిస్థితులు చేయిదాటి పోతున్నాయి. మరో పక్క వరి రైతు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మరోవైపు దక్షిణ కోస్తాను వరదలు ముంచాయి. చేతికి వచ్చిన పంట ధ్వంసమైంది. 57 మంది మృతి చెందారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున చెన్నైకు ప్రధాని వరాలు కుమ్మరించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో నష్టాన్ని అంచనా వేయటానికి ఉత్తి చేతులతో కరవు బృందాన్ని పంపించారు. ఈ అంశంపైనా సమగ్ర చర్చ అవసరం. ఇక విశాఖ మన్యాన్ని కుదిపేస్తున్న బాక్సైట్‌ తవ్వకాల జీవో జారీ విషయంపైనా పరస్పర నిందారోపణలకు అతీతంగా చర్చ అవసరం. అంతే గానీ, ఎప్పటిమాదిరిగానే సభ జరిగే ఆరురోజులూ… అర్థవంతమైన చర్చ జరపాలని అటు పాలక పక్షాన్ని, ఇటు ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలు వేడుకొంటున్నారు

Videos

22 thoughts on “చర్చా..రచ్చా..

Leave a Reply

Your email address will not be published.