ఒక దిగ్గజం గురువుగా… చీఫ్ కోచ్గా అనిల్ కుంబ్లే

కుంబ్లేను ఓ ఆటగాడిగా మాత్రమే గుర్తుంచుకోరు భారత అభిమానులు. అతడిది అంతకుమించిన, నిర్వచించలేని ప్రస్థానం. 132 టెస్టులు.. 619 వికెట్లు.. 271 వన్డేలు.. 337 వికెట్లు.. ఈ గణాంకాలే చెప్పేస్తాయి భారత క్రికెట్‌పై కుంబ్లే ముద్ర ఎలాంటిదని. భారత క్రికెట్‌ చరిత్రలోనే జట్టుకు అత్యధిక విజయాలందించిన బౌలర్‌ అతను. దశాబ్దంన్నర పాటు భారత స్పిన్‌ దాడికి నేతృత్వం వహించి.. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి.. గొప్ప గొప్ప బ్యాట్స్‌మెన్‌కు సైతం సింహస్వప్నంలా మారి.. జట్టు కష్టాల్లో ఉన్న ఎన్నోసార్లు నేనున్నానంటూ నిలబడి.. భారత క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో విజయాలందించిన ఘనుడు కుంబ్లే.

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా  దిగ్గజ  స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎంపికయ్యాడు.  ఈ మేరకు గురువారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కుంబ్లేను ప్రధాన కోచ్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.  ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియలో భాగంగా బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ల బృందం పలువురు అభ్యర్ధులను ఇంటర్య్వూ చేసిన అనంతరం కుంబ్లేను కోచ్ నియమించేందుకు మొగ్గు చూపింది.  ఈ నివేదిక ఆధారంగా  కుంబ్లేను ప్రధాన కోచ్ గా ఏడాదిపాటు నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.  దీంతో భారత క్రికెట్ జట్టుకు 11 వ కోచ్ గా కుంబ్లే త్వరలో బాధ్యతలు చేపట్టనున్నాడు.  ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే తో పాటు ప్రవీణ్ ఆమ్రే, లాల్‌చంద్ రాజ్‌పుత్, రవిశాస్త్రి, టామ్ మూడీ, స్టువర్ట్ లా, ఆండీ మోల్స్ తదితరులు పోటీ పడ్డారు.  వీరిలో రవిశాస్త్రి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా కుంబ్లేనే ప్రధాన కోచ్ పదవి వరించింది.

1990లో టెస్టు, వన్డే కెరీర్ ను ఒకేసారి ఆరంభించిన కుంబ్లే..అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్రను వేశాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన మూడో బౌలర్గా నిలిచి అరుదైన ఘనతను కుంబ్లే సొంతం చేసుకున్నాడు. 132 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన కుంబ్లే 619 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 35  సార్లు ఐదేసి వికెట్లను తీయగా, ఎనిమిదిసార్లు 10 వికెట్ల ఘనతను సాధించాడు.  ఇదిలా ఉండగా టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు సాధించిన రెండో బౌలర్గా కుంబ్లే నిలవడం విశేషం.1999లో పాకిస్తాన్తో ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్లో కుంబ్లే ఈ ఫీట్ను అందుకున్నాడు. అంతకుముందు ఈ ఘనతను ఇంగ్లండ్ కు చెందిన జిమ్ లేకర్ ఒక్కడే సాధించగా, ఆ తరువాత కుంబ్లే ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు సాధించాడు. మరోవైపు 271 వన్డేలు ఆడిన కుంబ్లే 337 వికెట్లను తీసి భారత్ కు అనేక విజయాలు అందించాడు.

ఇదిలాఉండగా, 2009లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(డబ్యూడీఏ) కమిషన్కు సభ్యునిగా నియమించబడ్డ కుంబ్లే.. 2010లో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెట్ కమిటీ చైర్మన్గా కుంబ్లే రెండో సారి ఎన్నికయ్యాడు. 2012లో తొలిసారిగా ఆయన ఈ  బాధ్యతలు చేపట్టగా.. 2016 మే నెలలో మరోసారి ఆ పదవిని అలంకరించారు. ఈ నియామకంతో 2018 వరకూ ప్యానెల్ కు చీఫ్‌గా కుంబ్లే వ్యవహరించనున్నారు.

‘‘ఇది గొప్ప బాధ్యత. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు నేనెప్పుడూ వెనుకంజ వేయలేదు. కోచ్‌ తెర వెనుక కష్టపడతాడు. ముందుండేది ఆటగాళ్లే. కోచ్‌ బాధ్యతలను తలకెత్తుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా. కొత్త పాత్రలో డ్రెస్సింగ్‌రూమ్‌లో మళ్లీ అడుగుపెట్టే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. జట్టు వ్యూహాలను ఆటగాళ్లతో చర్చించడానికి తగినంత సమయం ఉంది. నాకు కొన్ని స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక లక్ష్యాలున్నాయి. నేనొక్కడినే ప్రణాళికలు రచించలేను. ఆటగాళ్లు కూడా అందులో భాగం కావాలి. సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌, ద్రవిడ్‌లతో కలిసి ఆడాను. మా ఐదుగురి మధ్య గొప్ప బంధం ఉంది. మున్ముందు వాళ్లతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకెంతో ఇచ్చిన క్రికెట్‌కు.. నేనేదైనా తిరిగి ఇవ్వడానికి ఇదే సరైన సమయం’’
– కుంబ్లే

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *