ఏపీ అంతటా బంద్: నిలిచిన బస్సులు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల పిలుపుమేరకు బంద్‌ కొనసాగుతోంది. విభజన చట్టం అమలులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు వామపక్షాలు మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏపీ బంద్‌కు వైసీపీ, కాంగ్రెస్‌లు విడివిడిగా పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారకముందే రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన ఆయా పార్టీలకు చెందిన నేతలు ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. దీని ఫలితంగా పలు ప్రాంతాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. బంద్ కారణంగా 8 బస్ డిపోల్లోని 912 బస్సులు నిలిచిపోయాయి.

ఉదయం నుంచి ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకుని ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను అడ్డుకుంటున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వైకాపా, సీపీఎం, సీపీఐ నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద వామపక్షాల కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బంద్‌ ప్రభావం కనిపిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *