అమెరికాలో బాబుకు ఎదురుదెబ్బ? నిరసనలు తప్పేలా లేవా?

ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ పరిశ్రమల్ని ఆకర్షించే లక్ష్యంతో అమెరికా బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిరసనలు తప్పేట్లు లేవు. ఈ తెల్లవారు జామున అమెరికా బయలుదేరిన బాబు సాయంత్రం నుంచి అమెరికాలో బిజీబిజీగా గడపనున్నారు. అయితే బాబు పర్యటనలో ఆయన చుట్టూ ఉన్న కొందరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఓ వర్గం ప్రవాసాంధ్రులు నిర్ణయించారు. ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న వేమూరి రమేష్‌కు వ్యతిరేకంగా బాబు ఎదుట నిరసన తెలపాలని ఐటీ నిపుణులు నిర్ణయించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ఐటీ నిపుణుల నుంచి డాక్టర్‌ వేమూరి రమేష్‌కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

డల్లాస్‌ పరిసర ప్రాంతాల్లోని సిఈఓలతో చంద్రబాబును కలిసేందుకు బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ ఏపీఎన్‌ఆర్టీఏ ఏర్పాటు చేసింది. దీనిపై ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసి లాస్‌ ఏంజెల్స్‌లో నిరసన తెలపాలని నిర్ణయించింది. నిజానికి మే 6వ తేదీన డల్లాస్‌ సమీపంలోని లాస్‌ కొలినస్‌లోని ఓమ్నీ మండలే రెస్టారెంట్‌లో చంద్రబాబుతో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. దీనికి 200 డాలర్లను ఫీజుగా నిర్ణయించారు. ప్రవాసులు ఎవరైనా టిక్కెట్‌ కొని బాబుతో బేటీ బుక్‌ చేసుకోవచ్చని ఐటీ వర్గాలకు సమాచారమిచ్చారు. అయితే ఎన్‌ఆర్‌ఐ ప్రముఖులు ఈ విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌టి ఏర్పడక ముందు నుంచి డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు టీడీపీకి బాసటగా ఉన్నారని., తెలుగు దేశం పార్టీ అనుబంధంగా బలమైన యూత్‌ వింగ్‌ పనిచేస్తోందని., టిక్కెట్లు కొని బాబును కలిసే విధానం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

దీనిని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి విశాఖపట్నం -విజయవాడల్లో చేసుకున్న ఐటీ ఒప్పందాల్లో చాలా వరకు బోగస్‌వేనని., 5-10 మిలియన్‌ డాలర్ల లోపు ఆదాయం ఉన్న కంపెనీలతో కూడా ఒప్పందాలు చేయించి పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా కంపెనీలు హై ఫైలింగ్‌ వంటి ఆర్ధిక నేరాలకు పాల్పడి తమ సంస్థలను గొప్పగా చూపుకుంటాయని., వాటిని భారత్‌లో గొప్ప వాటిగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *