ఆటో డ్రైవర్లకు 10 వేలు…

అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందించి ఆసరాగా నిలుస్తామని తన పాదయాత్రలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనుంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఏడాదికి రూ.400 కోట్ల సాయం అందించనున్నారు. ఈ సాయాన్ని ఈ నెల నాలుగో వారంలో నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు అనుగుణంగా ప్రభుత్వం రవాణా శాఖకు మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ నెల 4న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. అర్హులైన వారిని గుర్తించేందుకు ఇప్పటికే రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. రేపటి నుంచి (మంగళవారం) అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లకు వెళతాయి. అనంతరం వెరిఫికేషన్‌ కోసం ఆయా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపుతారు. ఆ తర్వాత సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి ఈ సాయం వర్తింపజేయనున్నారు.

Videos