ఇకపై యాపిల్ స్టోర్ లోనే యాపిల్ ఫోన్లు

భారత మార్కెట్లో యాపిల్ డివైజ్ లకు డిమాండ్ ఎక్కువ. అయితే త్వరలో యాపిల్ ఫోన్లు సొంత ఆన్ లైన్ స్టోర్ లోనే అందుబాటుకు రానున్నాయి. ఇప్పటి వరకు అమెజాన్, ఫ్లిప్ కర్ట్ ఆన్ లైన్ స్టోర్లలోనే వీటిని విక్రయించేవారు. ఏక బ్రాండ్‌ రిటైల్‌ వాణిజ్యంలో ప్రభుత్వం ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భారత్‌లో స్టోర్లను మొదలుపెట్టాలంటే 30శాతం స్థానిక సోర్సింగ్‌ తప్పనిసరి. అంటే 51% వరకు ఎఫ్‌డీఐలున్న ఏక బ్రాండ్‌ రిటైల్‌ ట్రేడింగ్‌ సంస్థలు ఏటా 30 శాతం వరకు వస్తువులను దేశీయంగా సేకరించాలన్నది నిబంధన. దీని వల్ల చాలా విదేశీ కంపెనీలు సొంత బ్రాండ్లు తెరిచేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సోర్సింగ్‌ నిబంధనలను  ప్రభుత్వం సడలించింది. ఇకపై అయిదేళ్లకు సగటున 30 శాతం సమీకరించినా సరిపోతుందని తెలిపింది. దీంతో పాటు సంప్రదాయ స్టోర్లను ప్రారంభించకముందే ఆన్‌లైన్‌ విక్రయాలను సైతం కంపెనీలు ప్రారంభించడానికి కేబినెట్‌ ఆమోదించింది. తాజా ప్రకటనతో యాపిల్‌ భారత్‌లో సొంతంగా ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Videos