APSRTC చివరి సీట్లలో ప్రయాణిస్తే 20 శాతం రాయితీ

విజయవాడ: బస్సులో చివరి సీట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, అమరావతి దూరప్రాంత సర్వీసుల్లోని చివరి రెండు వరసల్లో ఉండే తొమ్మిది సీట్లకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం బస్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు. అడ్వాన్స్ రిజర్వేషన్‌తోపాటు కరెంట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడూ ఇది వర్తిస్తుందన్నారు. చివరి సీట్లలో ప్రయాణించేందుకు ఎవరూ ఇష్టపడకపోవడం వల్ల కొన్ని బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నామని, వెంటనే ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. 250 కిలోమీటర్లకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినవారికి ఆ తర్వాత రెండుగంటలపాటు సమీప ప్రాంతాలకు సిటీబస్సులు, జిల్లా సర్వీసుల్లో (తెలుగు వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు) ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని 40 రూట్లలోని 453 బస్సుల్లో అడ్వాన్స్ బస్ ఎరైవల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని దీని ద్వారా ఆయా స్టేషన్లకు ఎదురు చూస్తున్న బస్సు ఎంతసేపట్లో వస్తుందో తెలుస్తుందని సాంబశివరావు అన్నారు. తమ సెల్‌ఫోన్లో మిస్‌డ్ కాల్ ఇస్తే బస్సులో అమర్చిన యంత్రం ద్వారా ప్రయాణికుడు ఉన్న స్టేషన్లో ఎనౌన్స్‌మెంట్ వస్తుందని తెలిపారు. రూ.13.18 కోట్లతో రాష్ట్రంలోని 18 బస్‌స్టేషన్లను ఆధునీకరించామని రెండోదశలో అంతే మొత్తంతో రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని 64 బస్‌స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. నాన్-ట్రాఫిక్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ బస్‌స్టేషన్లలో వంద చొప్పున మెడికల్ షాపులు, వైద్య పరీక్షలు చేసే డయాగ్నోసిస్ షాపులు, మినీ థియేటర్లు, రిటైల్ షాపులు, డెంటల్, ఐ క్లినిక్ సెంటర్‌లకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.108 కోట్లు వస్తున్న నాన్-ట్రాఫిక్ ఆదాయాన్ని రూ.200 నుంచి రూ.250 కోట్లకు పెంచేందుకు వీటిని ఏర్పాటుచేస్తున్నామన్నారు.

పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖ సంఘ సంస్కర్తలు, వ్యాపారవేత్తలు ఎవరైనా బస్‌స్టేషన్లకు తమ పేరుగానీ, తాము సూచించిన వారి పేర్లుగానీ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని ఇందుకోసం నిర్దిష్ట సొమ్మును ఐదు సంవత్సరాలు చెల్లించాల్సివుంటుందని సాంబశివరావు చెప్పారు. ఉదాహరణకు ఉయ్యూరు స్టేషన్‌కు ఎ.రాధాకృష్ణ తరఫున ఎవరైనా రూ.5లక్షలు చెల్లిస్తే ఆ స్టేషన్ పేరు ఎ.రాధాకృష్ణ ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్‌స్టేషన్‌గా మారుస్తామన్నారు. దీనివల్ల ప్రకటనల ఆదాయం పెరుగుతుందన్నారు. బస్సుల సమాచారం తెలుసుకునేందుకు బస్టాండ్లలో పాసింజర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లు, పాసింజర్ మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు లైవ్ ట్రాక్ (వెహికల్ ట్రాకింగ్)ను సైతం ప్రవేశపెడతామని తెలిపారు. ఆర్టీసీకి ఈ సంవత్సరం రూ.4,101 కోట్ల ఆదాయం రాగా గత సంవత్సరం రూ.3,970 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. సంస్థకు ఆపరేషనల్ నష్టం లేదని, గతంలో చేసిన అప్పుల వల్లే నష్టాలు వస్తున్నాయన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ రూ.411కోట్ల నష్టం రాగా, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి అది రూ.500 కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. 30 రోజుల్లో 795 బస్సులను అద్దెకు తీసుకుంటున్నామని ఈసారి వాటిలో కొన్ని ఏసీ బస్సులు కూడా ఉన్నాయన్నారు. త్వరలో విజయవాడలో సెంట్రల్ ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, సంస్థ కార్పొరేట్ కార్యాలయం విజయవాడకు తీసుకొస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు ఎ.వెంకటేశ్వర్లు, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *