బాలకోట్ లో ఉగ్ర కదలికలు: బిపిన్ రావత్

బాలాకోట్‌లో ఉగ్రవాదుల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్టు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సోమవారం తెలిపారు. కనీసం 500 మంది ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని ఆఫీసర్ ట్రెయింగ్ అకాడమీలో కొత్త బ్యాచ్‌ శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావత్ విచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించామని, బాలకోట్ దాడులకు మించి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ఏమాత్రం సంకోచం లేదని అన్నారు.

ఉగ్రవాదుల చొరబాట్లపై వాతావరణ పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటాయన్నారు. ప్రస్తుతం మంచు కరగడంతో ఉత్తరంవైపు నుంచి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని రావత్ వ్యాఖ్యానించారు. పశ్చిమ సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోడానికి భారీగా బలగాలను మోహరించినట్టు ఆయన తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి ఆంక్షలు లేవని, ఇది ఉగ్రవాదులు సృష్టించిన ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

గ్యురేజ్, మచ్చల్, కెరాన్, తంగధర్, ఉరి, పూంచ్, నౌషెరా, సుందర్బనీ, ఆర్ఎస్ పుర, రామ్‌గఢ్, కథువా సమీపంలోని శిబిరాల్లో 250కిపైగా ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని ఐబీ హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో చొరబాట్ల సమన్వయానికి, సులభతరం చేయడానికి కాళీఘాటిలో ఓ సమాచార కేంద్రాన్ని ఉగ్రవాదులు ఆగస్టు తొలివారంలో ప్రారంభించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో లష్కరే తొయిబాకు చెందిన దౌరా ఈ ఆమ్‌లో కొత్తగా రిక్రూట్‌చేసుకున్న ఉగ్రవాదులకు శిక్షణ ప్రారంభించారు.

Videos