భారీ ఆధిక్యం దిశగా ఆసీస్

భారత్ జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తన రెండో ఇన్నింగ్స్ లో భాగంగా శుక్రవారం  ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిన ఆసీస్ కు ఓవరాల్ గా  298 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ రోజు ఆటలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(10), షాన్ మార్ష్(0) లు తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ, ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.  మూడో వికెట్ కు హ్యాండ్ స్కాంబ్(19) తో కలిసి 38 పరుగులు జత చేసిన స్మిత్.. నాల్గో వికెట్ కు రెన్ షా(31) తో కలిసి 52 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే స్మిత్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్మిత్ (59 బ్యాటింగ్; 117 బంతుల్లో 7 ఫోర్లు), మిచెల్ మార్ష్(21 బ్యాటింగ్;48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు క్రీజ్లో ఉన్నారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 105 పరుగులకే ఆలౌటైంది. కేవలం 40.1 ఓవర్లు మాత్రమే ఆడిన భారత్ జట్టు వంద పరుగుల మార్కును అత్యంత కష్టం మీద చేరింది.  94 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయిన భారత్.. మరో 11 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లను కోల్పోయి నిరాశపరిచింది.

ప్రధానంగా లంచ్ తరువాత ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీయడంతో భారత్ తేరుకోలేదు. భారత ఇన్నింగ్స్ 33 ఓవర్ లో మూడు ప్రధాన వికెట్లను తీసి షాకిచ్చాడు. కేఎల్ రాహుల్ (64), రహానే(13),సాహా(0)లను ఒకే ఓవర్ లో ఓకీఫ్ పెవిలియన్ కు పంపాడు. ఆపై లయన్ బౌలింగ్ లో అశ్విన్(1)అవుట్ కావడంతో భారత్ వంద పరుగులలోపే ఏడో వికెట్ ను నష్టపోయింది. దాంతో చతికిలబడ్డ భారత్  మరో మూడు వికెట్లను కూడా వెంటనే కోల్పోయింది. చివరి మూడు వికెట్లను కూడా ఓకెఫ్ ఖాతాలో చేరడం విశేషం. ఓవరాల్ గా ఓకీఫ్ ఆరు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, అతనికి జతగా స్టార్క్ రెండు, హజల్ వుడ్, లయన్ లు తలో వికెట్ తీశారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్  260 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 143/4

భారత్ తొలి ఇన్నింగ్స్ 105 ఆలౌట్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *