ఆసీస్ దే యాషెస్‌ సిరీస్

యాషెస్‌ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆదివారం ఇక్కడ ముగిసిన ఈ మ్యాచ్‌లో 383 పరుగుల భారీ లక్ష్యానికి గాను ఓవర్‌నైట్‌ స్కోరు 18/2తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య జట్టు 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఓపెనర్‌ జాన్‌ డెన్లీ (123 బంతుల్లో 53; 6 ఫోర్లు), జేసన్‌ రాయ్‌ (67 బంతుల్లో 31) ఓవర్లను కరిగిస్తూ వచ్చారు.

కానీ, రాయ్, మూడో టెస్టు హీరో బెన్‌ స్టోక్స్‌ (1)లను ఔట్‌ చేసిన కమిన్స్‌ (4/43) ఆసీస్‌కు పట్టు చిక్కేలా చేశాడు. తర్వాత డెన్లీ, బెయిర్‌ స్టో (61 బంతుల్లో 25), బట్లర్‌ (111 బంతుల్లో 34) జట్టును గట్టెక్కించేందుకు యత్నించారు. టీ విరామం తర్వాత బట్లర్, ఆర్చర్‌ (1) వెనుదిరిగినా లోయరార్డర్‌లో ఓవర్టన్‌ (105 బంతుల్లో 21), లీచ్‌ (51 బంతుల్లో 12) మరింత పట్టుదలగా ఆడి 14 ఓవర్ల పాటు నిలిచారు. డబుల్‌ సెంచరీతో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన స్టీవ్‌ స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యంలో ఉంది.

Videos