బాలయ్యతో రానా.. క్రిష్ తో రాజమౌళి

మంచి సినిమాను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. తనకేదైనా సినిమా నచ్చితే అది ఎంత చిన్నదైనా సరే.. దాని గురించి ట్విట్టర్లో పాజిటివ్ ట్వీట్లు పెడుతుంటాడు. జక్కన్న స్టాంప్ పడిందంటే ఆ సినిమా ఎంతమందికి చేరుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా గత ఏడాది పెళ్లి చూపులు.. మనమంతా లాంటి సినిమాలకు ఆయన అండగా నిలిచారు. ‘మనమంతా’ సినిమా ప్రమోషన్లకు కూడా సహకరించాడు. దాని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిని స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలుస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం కూడా రాజమౌళి అలాంటి ప్రయత్నమే చేసినట్లు సమాచారం.

శాతకర్ణి సినిమాను గొప్పగా రూపొందించిన క్రిష్ ను రాజమౌళి ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సమాచారం. ఈ వారంలో కొత్త సినిమాలేమీ లేని నేపథ్యంలో మరిన్ని వసూళ్లు రాబట్టుకోవచ్చనే ఉద్దేశంతో ‘శాతకర్ణి’ టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే ప్లాన్ చేసింది. అందులో భాగంగా రాజమౌళి.. క్రిష్ ను ఇంటర్వ్యూ చేస్తాడట. ‘శాతకర్ణి’ ట్రైలర్.. ఆ తర్వాత సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయిన రాజమౌళి.. క్రిష్ నుంచి తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి.. క్రిష్ ను ఇంటర్వ్యూ చేయడం ఆసక్తి రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపు శాతకర్ణి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయిన బాలయ్యను రానా ఇంటర్వ్యూ చేశాడట. ఈ రెండు ఇంటర్వ్యూలను ఒక టీవీ ఛానెల్ చేయించిందట. అవి నేడో రేపో బయటికి రానున్నాయి. కచ్చితంగా ఈ ఇంటర్వ్యూలు ఆసక్తి రేకెత్తిస్తాయి.. సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *