రివ్యూ: బాబు బాగా స్లో.. (బాబు బాగా బిజీ మూవీ రివ్యూ )

కథ :

మాధవ్ (శ్రీనివాస్ అవసరాల) అనే కుర్రాడు యుక్త వయసు ఆరంభం నుండే ఆడవాళ్ళ పట్ల, అమ్మాయిల పట్ల, శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ చాలా ఇన్నోసెంట్ గా ప్రవర్తిస్తూ స్కూల్ స్టేజ్ నుండే ప్లే బాయ్ లా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ అనేక మంది ఆడవాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటాడు.

అలా అతను రిలేషన్ కలిగి ఉన్న ఒక మహిళ మూలంగా ఎదురైన ఇబ్బంది వలన, పెళ్లి వయసు మీద పడటం వలన ఇక ఇవన్నీ ఆపేసి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొస్తాడు మాధవ్. అలా పెళ్లి చూపుల ద్వారా రాధ (మిస్తి చక్రబర్తి) ని కలిసి, తన గతం గురించి ఆమె దగ్గర దాచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని చెడు తిరుగుళ్ళు మానేయాలని ప్రయత్నిస్తుంటాడు. అలా జీవితంలో కీలకమైన డెసిషన్ తీసుకున్న మాధవ్ అనుకున్నట్టే చెడు తిరుగుళ్ళు మానేసి మంచివాడిగా మారాడా ? అతని జీవితంలోని ఆడవాళ్లు అతనికెలాంటి పాఠం నేర్పారు ? చివరికి అతని జీవితం ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది సినిమా కోసం ఎంచుకున్న నైపథ్యమనే చెప్పాలి. వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ స్టోరీ లైన్ సినిమా పట్ల ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయింది. ఇక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీనివాస్ అవసరాల ఇన్నోసెంట్ ప్లే బాయ్ గా మంచి నటన కనబరచడానికి సాయశక్తులా ప్రయత్నించి చాలా చోట్ల మెప్పించాడు. ముఖ్యంగా అతని పాత్రకు రాసిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అలాగే సినిమా ఆరంభంలో వచ్చే హీరో యొక్క చిన్ననాటి జీవితంలో జరిగే కొన్ని సంఘటనల తాలూకు సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఆ ఎపిసోడ్లో ఇన్స్పెక్టర్ గా పోసాని కృష్ణ మురళి చేసిన కాస్తంత కామెడీ నవ్వించింది. హీరో మారుదామనుకుని, హీరోయిన్ కు దగ్గరవ్వాలని ప్రయత్నించే కొన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ చాలా చక్కగా కుదిరింది. రియలిస్టిక్ లొకేషన్లలో ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కోసం అడల్ట్ కామెడీ నైపథ్యం తీసుకున్నామని, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుందని చెప్పడంతో సినిమాలో వాటి కోసమే వెతికే ప్రేక్షకులకు పెద్ద నిరాశ ఎదురవడం ఖాయం. ఆరంభం కొంచెం బాగానే ఉన్నా పోను పోను సినిమా రొటీన్ గానే తయారైంది. పోసాని కామెడీ మినహా ఎక్కడా ఎంజాయ్ చేయగల కంటెంట్ కొంచెం కూడా దొరకలేదు. పైగా దర్శకుడు నవీన్ మేడారం కథనాన్ని కాసేపు ప్రస్తుతంలో ఇంకాసేపు గతంలో నడుపుతుండటంతో కాసేపటికే ఆ విధానం బోర్ అనిపించింది.

హీరో జీవితంలో ఉండే అమ్మాయిల్లో ఏ ఒక్కరినీ కూడా డీటైల్డ్ గా చూపకపోవడం, వాళ్ళతో హీరో రిలేషన్ ఎలా సాగింది అనేది చెప్పకపోవడంతో నిరుత్సాహం కలిగింది. అలాగే కథనం కూడా ఒక ట్రాక్లో నడవకుండా కాసేపు హీరోలోని చెడు, కాసేపు అతనిలోని మంచిని చూపించడంతో వాటిలో ఏ ఒక్కటి కుడా చూసే ప్రేక్షకుడికి బలంగా కనెక్టవ్వలేకపోయాయి.

ఇక నెమ్మదిగా, అడాప్ట్ చేసుకోలేని ఎమోషన్ తో సాగే సెకండాఫ్లో హీరో మారడానికి కారణమైన అంశాలని కథతో కనెక్టయ్యే విధంగా చూపలేకపోవడవంతో ముఖ్యమైన ఆ అంశం కూడా సైడ్ ట్రాక్లో నడుస్తున్నట్టు అనిపించి కథనానికి అడ్డుపడుతున్నట్లుగా తోచింది. అలాగే చెడుకు, మంచికి మధ్య హీరో పాత్ర పడే ఘర్షణను కూడా సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు దర్శకుడు. ప్రియదర్శి వంటి మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ ని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. చివరి క్లైమాక్స్ అయితే చాలా సాదాసీదాగా, రొటీన్ గానే ఉంది తప్ప కొత్తగా, ప్రభావంతంగా ఏమీ లేదు.

సాంకేతిక విభాగం :

సినిమా విజువల్స్ పరంగా బాగేనా ఉంది. సినిమాటోగ్రఫీని బాగానే హ్యాండిల్ చేశారు. ఇహిందీ సినిమాను తెలుగులోకి రీమేక్ చేద్దామని అనుకున్న దర్శకుడు నవీన్ మేడారం దానికి తగిన హోమ్ వర్క్ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అడల్ట్ కామెడీ కంటెంట్ నైపథ్యం తీసుకుని తెలుగు నేటివిటీ కోసం మార్పులు చేయాలనే సాకుతో ఎక్కడా ఊహించిన ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వలేకపోయాడు.

అంతేకాక చేసిన మార్పులైనా కొత్తగా, చూడదగ్గవిగా ఉన్నాయా అంటే అదీ లేదు. మొదటి భాగమే నెమ్మదిగా ఉందంటే రెండవ భాగం అంతకంటే నిదానంగా, బోరింగా నడిచింది. ఇక కథనం మధ్యలో వచ్చే పాటలకు సునీల్ కశ్యప్ అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేసుండాల్సింది. అభిషేక్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

విడుదల తేదీ : మే 5, 2017

రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : నవీన్ మేడారం

నిర్మాత : అభిషేక్ నామ

సంగీతం : సునీల్ కశ్యప్

నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, మిస్తి చక్రబర్తి, తేజశ్వి మదివాడ

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *