నల్లకుబేరుల పేర్లు బట్టబయలు, ‘బహమాస్’ లీక్స్‌లో నిమ్మగడ్డ

పనామా పేపర్స్‌ సృష్టించిన సంచలనం మరువక ముందే ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే).. మరోసారి సంచలనాత్మకమైన పత్రాలను బయటపెట్టింది. ‘బహమాస్‌ లీక్స్‌’ పేరిట ‘నల్ల ముఠా’ గుట్టు రట్టు చేసింది. జర్మనీ వార్తాపత్రిక సడుట్చే జైటుంగ్‌, భారత్‌లోని న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు మీడియా భాగస్వాములతో కలిసి బహమాస్‌ దేశంలో నమోదైన 1,75,000 కంపెనీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్లు, వ్యక్తుల ఆస్తుల వివరాలను విడుదల చేసింది. కరీబియన్‌ పన్ను స్వర్గధామ దేశంగా వెలుగొందుతున్న బహమా్‌సలో అక్రమ సొమ్మును దాచుకునేందుకు 1990 నుంచి 2016 మధ్య కాలంలో ఈ కంపెనీలన్నీ నమోదయ్యాయని ఐసీఐజే వెల్లడించింది. ఈ బహమాస్‌ లీక్స్‌ జాబితాలో భారత కార్పొరేట్‌ రంగంతో సంబంధం ఉన్న 475 సంస్థలున్నాయి. ఇందులో గనులు, మెటల్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, రియల్‌ ఎస్టేట్‌, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు చెందిన అధిపతులున్నారు. తెలుగు రాషా్ట్రలకు చెందిన వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌, బారన్‌ గ్రూప్‌ అధినేత కబీర్‌ మూల్‌చందానీ, ఫ్యాషన్‌ టీవీ ఇండియా ప్రమోటర్‌ రాజన్‌ మధు, ప్రీమియం ఫిన్నిష్‌ వాటర్‌ బ్రాండ్‌ చైర్మన్‌ అమన్‌ గుప్తా, గుర్జీత థిల్లాన్‌, హర్‌భజన్‌ కౌర్‌, మైరా డిలోరస్‌ రెగో, అశోక్‌ చావ్లా సహా ఇంకా ప్రముఖ వ్యక్తులు ఉన్నట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో వెల్లడించింది. పనామా పేపర్స్‌ లీక్‌లో ఉన్న ప్రముఖులు.. బహమాస్‌ లీక్స్‌లోనూ ఉండటం గమనార్హం. ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్‌) కింద నల్ల ధనం వివరాలను వెల్లడించేందుకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం గడువు విధించిన తరుణంలో బహమాస్‌ లీక్స్‌ జాబితాలో పెద్ద ఎత్తున భారత కార్పొరేట్‌ రంగానికి చెందిన కంపెనీలు ఉండటం గమనార్హం.

10కి పైగా కంపెనీలు నిమ్మగడ్డవే..

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, ఆయన సోదరుడు ప్రకాశ్‌ నిమ్మగడ్డ.. బహమాస్‌లో దాదాపు పది విదేశీ కంపెనీలున్నాయి. క్రిస్టల్‌ లేక్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌సి (2007 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు), బెస్ట్‌ స్కైలైన్‌ ఇంక్‌ (ఏప్రిల్‌ 1, 2009), రౌగ్‌మోంట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డిసెంబర్‌ 27 నుంచి 2011 జనవరి 3 వరకు) కంపెనీలకు ప్రసాద్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. మరోవైపు ఆయన సోదరుడు ప్రకాశ్‌ నిమ్మగడ్డ.. సిల్వర్‌ క్లిఫ్‌ ప్రాపర్టీస్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి ఇప్పటివరకు), బెస్ట్‌ స్కైలైన్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి డిసెంబర్‌ 27, 2007 వరకు), క్రిస్టల్‌ లేక్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌సి (డిసెంబర్‌ 27, 2007 నుంచి జనవరి 3, 2011 వరకు), బెస్ట్‌ హారిజాన్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి డిసెంబర్‌ 27,2007 వరకు), కన్వెన్షియానా ఎస్టేట్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి డిసెంబర్‌ 27, 2007 వరకు), టాప్‌ స్కైలైన్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి జూలై 26, 2010 వరకు), సూపర్‌ స్కేప్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి డిసెంబర్‌ 27, 2007 వరకు), రౌగ్‌మోంట్‌ హోల్డింగ్స్‌ (జూన్‌ 7 2007 నుంచి డిసెంబర్‌ 27, 2007 వరకు) సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరించినట్లు బహమాస్‌ రిజిస్ట్రీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. క్రిస్టల్‌ లేక్‌, రౌగ్‌మోంట్‌ హోల్డింగ్స్‌ కంపెనీలకు జనవరి 3, 2011న ప్రసాద్‌ నిమ్మగడ్డ రాజీనామా చేయగా టాప్‌ స్కైలైన్‌ ఇంక్‌, సిల్వర్‌ క్లిఫ్‌ ప్రాపర్టీస్‌ మినహా మిగిలిన బహమాస్‌ కంపెనీల నుంచి ప్రకాశ్‌ నిమ్మగడ్డ తప్పుకున్నారు.
మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా అందరికీ సుపరిచితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌.. రియల్‌ ఎస్టేట్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2000 సంవత్సరంలో ఖాయిలాపడిన హెర్రెన్‌ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి మ్యాట్రిక్స్‌ ఫార్మాస్యుటికల్స్‌గా పేరు మార్చి లాభాలబాట పట్టించారు. 2006లో అమెరికా ఫార్మా కంపెనీ మైలాన్‌ లేబొరేటరీస్‌కు మ్యాట్రిక్స్‌ను విక్రయించి పెద్ద ఎత్తున లాభాలను మూటగట్టుకున్నారు. వాడ్రేవు, నిజాంపట్నం మధ్య పారిశ్రామిక కారిడార్‌ (వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌) కోసం 2008 జనవరిలో రాక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుని మ్యాట్రిక్స్‌ ఎన్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నెలకొల్పారు. ఈ తరుణంలోనే ప్రసాద్‌ జగన్‌ కంపెనీల్లో 854 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి.. అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. మరోవైపు హెల్త్‌కేర్‌, హాస్పిటల్స్‌ల్లో ప్రసాద్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడమే కాకుండా మా టీవీ ఏర్పాటు చేసి మీడియా రంగంలోకి ప్రవేశించారు. 2015లో మా టీవీని స్టార్‌ టీవీకి విక్రయించి భారీ లాభాలను అందుకున్నారు.
Videos

44 thoughts on “నల్లకుబేరుల పేర్లు బట్టబయలు, ‘బహమాస్’ లీక్స్‌లో నిమ్మగడ్డ

Leave a Reply

Your email address will not be published.