నవ్విపోదురు గాక.. ఆ పత్రిక కథనం!

అవును.. వుయ్ రిపోర్ట్ యు డిసైడ్ అనేది ఆ మీడియా సంస్థ మోటో. వాళ్లంతకు వాళ్లు తోచిందేదో చెబుతూ ఉంటారు, నవ్వుకునే జనాలు నవ్వుకోవచ్చనమాట! అలా నవ్వుల పాలవుతున్నా.. తెలుగుదేశం అనుకూల పత్రికకు గానీ, ఆ మీడియా వర్గం అధినేతకు గానీ కించిత్ మొహమాటం అయినా లేకపోవడమే ఇప్పుడు విశేషం. తెలుగుదేశం పార్టీకి జాకీలు వేయడమే పనిగా పెట్టుకుని.. తెలుగుదేశం అధినేతపై ప్రేమాభిమానాలను, అంచంచలమైన భక్తిని ఎక్కడా దాచుకోక, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై వీలైతే విషం లేకపోతే బురద జల్లడం ఆ మీడియాకు బాగా అలవాటైన పనే!

ఇది కొత్తేమీ కాదు.. ఆది నుంచి జరుగుతున్నదే! ఈ పరంపరలో తాజా కథనాలు చోటు సంపాదించుకున్నాయి. ఒకటి జగన్ మోహన్ రెడ్డి వెళ్లి ప్రధానితో సమావేశం అయితే దానికి వక్రభాష్యం పలకడం, రెండో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు నాయుడు ఏడు గంటల పాటు మాయం అయితే.. దానికి పెట్టుబడుల కట్టుకథ అల్లడం! ఈ రెండు కథనాలూ.. కళ్లకు కట్టినట్టుగా వండి వార్చి నవ్వుల పాలవుతోంది.

ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత కలవడం తప్పవుతుందా? జగన్ ఎన్డీయేలో భాగస్వామి గాకపోవచ్చు, అలాగని ప్రధానిని కలవకూడదా? అలా అయితే.. మోడీ పై ఒంటికాలితో లేచే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికనేక సార్లు మోడీతో సమావేశం అయ్యాడుగా! ఇక జగన్ మోడీతో రహస్యంగా సమావేశం అయ్యాడనేది తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా మాట. మరి ప్రధానితో సమావేశం అయితే అది రహస్యం అవుతుందా? అంటే ప్రధానమంత్రి మోడీ.. అలాంటి రహస్య సమావేశాలు నిర్వహించే టైపా? బహుశా ఆ మాటతో జగన్ మీద బురదజల్లుతున్నామనుకుని ఈ వర్గాలు ప్రధాని మోడీ పై కూడా బురదజల్లుతున్నారు!

ఇక జగన్ మోడీతో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించలేదు.. తన పై కేసుల గురించి విన్నవించుకున్నాడు.. అంటూ తన పైత్యాన్ని మొత్తం రంగరించింది ఆ పత్రిక, టీవీ చానల్. ఒకవైపు రహస్య సమావేశం అనేదీ ఈ మీడియానే, మరోవైపు ఆ సమావేశంలో ఏం జరిగిందీ చెప్పేదీ ఈ మీడియానే!

ఇందుకు కదా.. ఇది ప్రహసనం అవుతున్నది? బురద జల్లడంలో కూడా ఒక స్టాండ్ లేదా, అలా కాసేపు, ఇలా కాసేపు! ఒక్కటైతే వాస్తవం.. ప్రధానమంత్రి తో జగన్ సమావేశం కావడం అనేది.. తెలుగుదేశం పార్టీకి భారీ ఝలక్ లాగే ఉంది. చంద్రబాబు సర్కారు అవినీతి, కులప్రీతి, బంధుప్రీతి, బాబు తన తనయుడిని ప్రమోట్ చేసుకోవడం.. రాజధాని ప్రహసనం.. వీటన్నింటిమీదా పక్కా ఆధారాలతో ప్రధానిని కలిసి.. చంద్రబాబు జుట్టును మోడీ చేతుల్లో ఇరికించాడు జగన్ మోహన్ రెడ్డి. ఆ కసి అంతటినీ అలాగే ప్రదర్శించలేక.. తెలుగుదేశం అనుకూల మీడియా ఇలా అడ్డదారిలో పడిపోతోంది. జగన్ మోడీకి ఇచ్చిన వినతి పత్రం మొత్తాన్నీ ప్రచురించలేక ఏదో ఒక పేపర్ ముక్కను పట్టుకుని నోరేసుకుని రాధాక్రిష్ణ మీడియా రెచ్చిపోతోంది. అయితే తన వీరావేశాన్ని, తను జగన్ మీద శివాలెత్తిపోతూ.. అతడి మీద అక్కసు వెల్లగక్కుకోవడాన్ని చూసి జనాలు నవ్వుకొంటున్నారని ఈ మీడియా వర్గానికి ఏనాటికి అర్థం అయ్యేనో!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *