రైనాది స్వయంకృతమా?

నిన్న మొన్నటి వరకూ భారత క్రికెట్ జట్టు ప్రధాన ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకడు. భారత జట్టు వన్డే, ట్వంటీ 20  సిరీస్ లకు సిద్ధమవుతుందంటే రైనా స్థానం పదిలంగా ఉండేది. అయితే ఎప్పుడు ఒకే పరిస్థితి ఉండదనేది అతని పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వ్యవరించిన తీరే ఉదాహరణ. ఇటీవల విడుదల చేసిన ఆటగాళ్ల వార్షిక గ్రేడ్ల జాబితాలో రైనాను అస్సలు పట్టించుకోలేదు. రైనా కనీసం ‘సి’ గ్రేడ్లో  కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్ తో జరిగిన ట్వంటీ20సిరీస్ లో ఆడిన రైనాను ఉన్నపళంగా బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టాల్సివచ్చిందనేదానికి అతని స్వయంకృతమే ప్రధాన కారణంగా కనబడుతోంది. ప్రస్తుతం అతను ఆటకంటే కూడా కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కకపోవడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదర్నీ పెళ్లి చేసుకున్న తరువాత రైనా పూర్తిగా ఇంటికే పరిమితమవుతూ ఆటను పట్టించుకోవడం లేదట.

‘రైనా ప్రయారిటీ మారింది. ప్రధానంగా అతను పెళ్లి చేసుకున్న తరువాత ఆటపై దృష్టి తగ్గించాడు. ఈ విషయాన్ని రైనాకు చాలాసార్లు చెప్పాను కూడా.  అయితే నేను చెప్పినదాన్ని రైనా ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను చెప్పడానికి పరిమితమైతే, దాన్ని రైనా సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు.ఈ  సీజన్లో ఉత్తరప్రదేశ్ తరపున కేవలం మూడు రంజీ మ్యాచ్లను మాత్రమే రైనా ఆడాడు. ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీల్లో కూడా రైనా పాల్గొనలేదు. ఇవన్నీ కూడా అతన్ని భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చడానికి కారణం. ఆ క్రమంలోనే ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో రైనా వెనుకబడిపోయాడు కూడా ‘అని పేరును చెప్పడానికి ఇష్టపడని ఒక క్రికెట్ కోచ్ పేర్కొన్నారు.

ఇటీవల బీసీసీఐ 32 మందితో ప్రకటించిన జాబితాలో సురేశ్‌ రైనాకు చోటు దక్కకపోవడమే అనూహ్యం. గత ఏడాది అతను గ్రేడ్‌ ‘బి’లో ఉన్నాడు. వన్డే జట్టులో స్థానం లేకపోయినా… భారత టి20 జట్టు సభ్యుడిగా ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఈ మ్యాచ్‌లన్నీ కూడా తాజా ఒప్పందాలు అమలు చేయబోతున్న తేదీ తర్వాత ఆడినవే. రైనాకు దిగువ గ్రేడ్‌కు కూడా పంపించకుండా పూర్తిగా కాంట్రాక్ట్‌ నుంచే తప్పించడం ఆశ్చర్యకర పరిణామం. మరి దీనికి రైనా స్వయంకృతమే కారణంగా కనబడుతోంది.
ఇదిలా ఉంచితే గత ఏడాది జాబితాలో లేని యువరాజ్‌ సింగ్, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు ఈ సారి గ్రేడ్‌ ‘బి’లో స్థానం లభించింది. భారత్‌ తరఫున 3 టి20లు ఆడిన మన్‌దీప్‌ సింగ్, ఒకే ఒక టి20 ఆడిన రిషభ్‌ పంత్‌లకు తొలిసారి చోటు దక్కగా… భారత్‌ తరఫున ఇంకా అరంగేట్రం చేయని శార్దుల్‌ ఠాకూర్‌కు కాంట్రాక్ట్‌ దక్కడం మరో విశేషం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *