రివ్యూ: ‘భరత్‌ అనే నేను’

కథ:
భరత్‌ రామ్‌(మహేష్‌ బాబు)కు కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకే లండన్‌ ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో తండ్రి రాఘవ(శరత్‌ కుమార్‌) మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. రాఘవ మృతిలో పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు రాజకీయ గురువు వరద(ప్రకాశ్‌ రాజ్‌) భరత్‌ను సీఎంను చేస్తాడు. అదుపు తప్పిన ప్రజా జీవితాన్ని భరత్‌ తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే యత్నం చేస్తుంటాడు. భరత్‌ దూకుడు స్వభావం రాజకీయ వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ప్రజల నుంచే కాకుండా.. సొంత పార్టీ నుంచే కూడా ప్రతిఘటన ఎదురవుతుంటుంది. అయినా వాటన్నింటిని అధిగమించి భరత్‌ తన ప్రామిస్‌లను ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే కథ.

నటీనటులు
భరత్‌ రామ్‌గా మహేష్‌ బాబు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన కెరీర్‌లో మహేష్‌ క్లాస్‌ రోల్స్‌ చేసినప్పటికీ.. వాటిలో ఏదో వెలితిగా అనిపించేది. కానీ, భరత్‌గా ఓ ఛాలెంజింగ్‌ రోల్‌లో మహేష్‌ పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ చీఫ్‌ మినిస్టర్‌ పాత్రలో స్టైలిష్‌గా అలరించాడు. తన కెరీర్‌ బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు.

ఇక గాడ్‌ ఫాదర్‌ పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ మెప్పించాడు. ఇలాంటి పాత్రలను తాను తప్ప మరెవరూ పోషించలేనన్న రీతిలో ఆయన నటించాడు. వసుమతి పాత్రలో కైరా అద్వానీ బాగుంది. సీఎం భరత్‌ పర్సనల్‌ సెక్రటరీగా బ్రహ్మజీ.. పోసాని కామెడీ ట్రాక్‌లు ఆకట్టుకున్నాయి. శరత్‌ కుమార్‌, ఆమని, సితార, అజయ్‌, రావు రమేష్‌, దేవరాజ్‌, తమ పాత్రల మేర అలరించారు.

విశ్లేషణ
హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్లతో జోరు మీదున్న కొరటాల.. మహేష్‌తో చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. సమకాలీన రాజకీయ అంశాలు.. వాటికి తగ్గట్లు కమర్షియల్‌ అంశాలను జోడించి ప్రేక్షకులను ఎంగేజ్‌ చేశాడు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి ఏకంగా సీఎం అయిపోవటం, త్వరగతిన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టడం, అసెంబ్లీలో సరదాగా సాగిపోయే సన్నివేశాలు… ఫస్టాఫ్‌ను ఎంటర్‌టైన్‌గా మలిస్తే, దుర్గమహల్‌ ఫైట్‌.. సామాజిక సందేశం, హీరోయిజం ఎలివేట్‌ అయ్యే సన్నివేశాలు… ఇవన్నీ సెకండాఫ్‌ను నిలబెట్టాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీయటం… భరత్‌ సీఎంగా రాజీనామా-తిరిగి పగ్గాలు చేపట్టం లాంటి సన్నివేశాల్లో దర్శకుడు నాటకీయత ఎక్కువగా జోడించాడు.

ఇక టెక్నీకల్‌ టీమ్‌ మంచి తోడ్పాటును అందించింది. సినిమాటోగ్రఫర్‌ రవి కే చంద్రన్‌, తిర్రు టాప్‌ క్లాస్‌ పనితనాన్ని అందించారు. దేవీ పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మెప్పించాడు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  భరత్‌ పాత్ర.. దానిలో మహేష్‌ కనబరిచిన నటన.. కొరటాల అందిచిన డైలాగులు ఇలా అన్ని హంగులు అన్ని వర్గాల ప్రేక్షలను అలరించేవిగా ఉన్నాయి.

ఫ్లస్‌ పాయింట్లు :
మహేష్‌ బాబు
కథా-కథనం
పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌
సమకాలీన రాజకీయాంశాలను సమతుల్యంగా చూపించటం.

మైనస్‌ పాయింట్లు:

స్లో నెరేషన్‌
సాగదీత సన్నివేశాలు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *