తలబొప్పి కట్టిస్తున్న నంద్యాల రాజకీయం..

నంద్యాల ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది.. ఎట్టకేలకు భూమా కుటుంబానికే టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో  అసంతృప్త నేతలందరూ  ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు..  వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చేసుకుంటున్న జగన్ టిక్కెట్ ఎవరికిస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చారా? ఇక్కడా సీటు కన్ ఫామ్ కాకపోతే వలస పక్షుల గతేంటి? అసలు నంద్యాలలో ఏకగ్రీవం సాధ్యమా?

సీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో  నంద్యాల నియోజకవర్గానికి దేశ రాజకీయ చిత్రపటంలో ప్రత్యేక స్థానం ఉంది. దేశానికి ప్రధాన మంత్రిని, రాష్ట్రపతిని అందించిన ఘనత ఈ నియోజకవర్గానిది. 1977లో నీలం సంజీవరెడ్డి నంద్యాల లోక్ సభ నుంచి గెలిచి ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలాగే పీవీ నరసింహ రావు కూడా ప్రధాని అయిన తర్వాత నంద్యాల నుంచి పోటీ చేశారు. తెలుగు వారు కావడంతో ప్రజలు భారీ మెజార్టీ తో గెలిపించి ఢిల్లీకి పంపారు. అంతేకాకా కేంద్ర, రాష్ట్రమంత్రులను కూడా ఈ నియోజకవర్గం ఎంతో మందిని అందించింది.

రాజకీయ చైతన్యానికి ప్రతీక అయిన నంద్యాల ఇప్పుడు రాజకీయం గందరగోళానికి వేదికైంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తర్వాత నంద్యాల రాజకీయం గజిబిజిగా మారింది. టీడీపీ, వైసీపీ రెండింటిలోనూ టిక్కెట్ ఆశించే ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. టీడీపీ అభ్యర్ధిగా భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తారని సీఎం ప్రకటించినా మాజీ మంత్రి ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డిలు అలక వీడలేదు. అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన మాజీ మంత్రి శిల్పా సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి  జిల్లా నేతల సమావేశానికి డుమ్మా కొట్టి నిరసన తెలిపారు. మరోవైపు టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి  వైసీపీలో చేరిపోయారు.

శిల్పా మోహన్ రెడ్డి , వైసీపీలో చేరడంపై అధికార పార్టీ అంతర్మథనంలో పడింది. సంప్రదాయం ప్రకారం చనిపోయిన కుటుంబానికే టికెట్ ఇవ్వాలన్న ఆనవాయితీ ప్రకారం భూమా బ్రహ్మానందరెడ్డినే అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించిన వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు తన దూతగా మంత్రి నారాయణ,  కేంద్ర మంత్రి సుజనా చౌదరిని, రాష్ట్రమంత్రి కాల్వ శ్రీనివాసులను రంగంలోకి దింపారు. మంత్రి నారాయణ ఒకడుగు ముందుకేసి ముఖ్యమంత్రి పర్యటనకు మూడు రోజుల ముందే నంద్యాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భూమా అఖిల ప్రియ, ఎన్ఎండీ ఫరూక్, ఎస్పీవై రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య సఖ్యత లేకపోవడంపై అధినేత తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని మంత్రి నారాయణ నేతలకు తెలియజేస్తున్నారు. ఇలాగే ఎన్నికలకు వెళితే పార్టీ కొంప మునిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక వైసీపీ నంద్యాల సీటు టెక్నికల్ గా తమదేనంటోంది. కాబట్టే ఉప ఎన్నికల్లో గెలిచి 2019 ఎన్నికలకు ఇక్కడి నుంచే సమర శంఖం పూరించాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగానే టీడీపీలో అసంతృప్త నేతలకు వైసీపీ గాలం వేస్తోంది. ఈ గాలానికి ఇప్పటికే మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్చార్జి శిల్పా మోహన్ రెడ్డి పడ్డారు. అలాగే మరో అసంతృప్త నేత ఏవీ సుబ్బారెడ్డికి కూడా వైసీపీ గాలం వేసినట్టు సమాచారం. ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి కూడా వైసీపీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అసంతృప్త నేతలందరినీ తనవైపు లాక్కుంటున్న వైసీపీ టిక్కెట్ ఎవరికి కేటాయిస్తుందన్నది సస్పెన్స్ గా మారింది. టీడీపీలో చేరిన శిల్పా తో పాటూ నంద్యాల వైసీపీ ఇన్ చార్జి రాజగోపాల్ రెడ్డి కూడా టిక్కెట్ పై ఆశపెంచుకున్నారు. వీరిలో ఎవరో ఒకరికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాల్సి వస్తుంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నది చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికే వైసీపీలో కూడా టిక్కెట్ కోసం రాజగోపాల్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర పోటీ పడుతున్నట్టు సమాచారం.

మరో పక్క నంద్యాల ఉప ఎన్నిక జరుగుతుందని కొందరు ఏకగ్రీవం అవుతుందని మరికొందరు బెట్టింగ్ లు వేస్తున్నారు.  టీడీపీ నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డిని ఎంపిక చేయడంతో మరి ఎంపీ ఎస్పీవై రెడ్డి ఏం చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది తన రాజకీయ వారసుడిగా తన అల్లుడిని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఒక వేళ ఉప ఎన్నిక అనివార్యమైతే వైసీపీ అభ్యర్ధి గా శిల్పాకే టిక్కెట్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే రాజగోపాల్ రెడ్డికి రిక్తహస్తం తప్పదు మరి మొత్తం మీద నంద్యాల రాజకీయం హాట్ హాట్ గా మారింది ఏక్రగీవం కాకపోతే పోటీ తప్పదు పోటీ జరిగితే టీడీపీ, వైసీపీలలో గెలుపెవరిది అన్న అంశంపైనే  అందరి కళ్లూ నిలిచి ఉన్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *