పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ స్కామ్ – మాల్యా రూట్లోనే నిరవ్ మోదీ.. పారిపోయాడు!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండోది అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ముంబై నగరంలోని ఒక శాఖలో ఈ కుంభకోణం బయటపడిందని, ఆ శాఖలో 177 కోట్ల డాలర్ల (రూ.11,346 కోట్ల) మోసపూరిత లావాదేవీలు కొనసాగినట్లు తేలడంతో ఆ శాఖ డిప్యూటీ మేనేజర్, మరో తొమ్మిది మంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు సొమ్ము రికవరీ కోసం కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు (దర్యాప్తు సంస్థలకు) నివేదించామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. ఈ కుంభకోణం వలన జరిగిన నష్టం గత సంవత్సరం పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్జించిన రూ.1,320 కోట్ల నికర ఆదాయం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కాగా, ఈ బ్యాంకు మొత్తం మార్కెట్ విలువలో మూడింట ఒకటో వంతుగా ఉన్నది.

కొంత మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ మోసపూరిత, అనధికార లావాదేవీలు నిర్వహించి నట్టు గుర్తించామని, ఈ మొత్తాన్ని ఆయా ఖాతాదారులు ఇతర బ్యాంకుల ద్వారా విదేశాలకు తరలించినట్లు తెలుస్తున్నదని, దీంతో ఈ కుంభకోణం ఇతర బ్యాంకులకు కూడా విస్తరించే అవకాశం ఉన్నదని ఆ బ్యాంకు బుధవారం ఒక ప్రకటనలో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కి వివరించింది. అయితే ఆ ఇతర బ్యాంకులు ఏవో పీఎన్‌బీ వెల్లడించలేదు. ముంబైలోని బ్రాడీ హౌస్ పీఎన్‌బీ శాఖలో పనిచేస్తున్న గోకుల్‌నాథ్ షెట్టి, మనోజ్ హనుమెంత్ ఖరత్ అనే ఉద్యోగులు మోసపూరిత అండర్‌టేకింగ్ లెటర్లు జారీ చేశారు. డైమండ్ ఆర్ యూఎస్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్ అనే సంస్థల్లో భాగస్వాములుగా ఉన్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీ, నిశాల్ మోదీ, అమీ నిరవ్ మోదీ, మెహుల్ చినూభాయ్ చోక్సీ అనే వ్యక్తులతో కుమ్మక్కై వారు ఈ అక్రమాలకు పాల్పడ్డారు .

అని పీఎన్‌బీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. స్వభావ రీత్యా ఇవి తాత్కాలిక లావాదేవీలని, ఈ లావాదేవీలకు సంబంధించిన వాస్తవ వివరాలను లోతుగా పరిశీలించి వీటి వలన తమకు ఎంత నష్టం జరిగిందో నిగ్గు తేలుస్తామని పీఎన్‌బీ పేర్కొన్నది. ఈ అక్రమ లావాదేలకు పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ కేసును ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు నివేదించామని, పారదర్శకతకు పెద్దపీట వేసి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో మచ్చ లేకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని ఆ బ్యాంకు స్పష్టం చేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇటువంటి అక్రమాలు జరగడం గత పది రోజుల్లో ఇది రెండోసారి. గతేడాది పీఎన్‌బీని రూ.280.70 కోట్ల మేరకు మోసగించారన్న అభియోగాలతో నిరవ్ మోదీతో పాటు ఆయన భార్య అమీ, సోదరుడు నిశాల్, వారి వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈ నెల 5వ తేదీన కేసు నమోదు చేసిన విషయం విదితమే.

వీరంతా తమ బ్యాంకు అధికారులతో కలసి కుట్రకు పాల్పడి ఉద్ధేశ్య పూర్వకంగా నష్టం కలిగిస్తున్నారని పీఎన్‌బీ ఫిర్యాదు చేయడంతో ఆ కేసును దాఖలు చేసిన సీబీఐకి ఇప్పుడు తాజా కుంభకోణంలో నిరవ్ మోదీతో పాటు ఆయన జ్యూయెల్లరీ కంపెనీలపై మరో రెండు ఫిర్యాదులు అందాయి. ముంబై నగరంలోని తమ శాఖలో దాదాపు రూ.11,400 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, ఈ లావాదేవీల్లో నిరవ్ మోదీతో పాటు ఆయన జ్యూయెల్లరీ సంస్థ ప్రమేయం ఉందని పీఎన్‌బీ ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *