అరుణ్ జైట్లీ మృతి…

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ (66) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6వ తేదీ నుండి ఢీల్లీలోని ఎయిమ్స్‌ లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. న్యాయవాది వృత్తిలో దిట్టగా పేరొందిన జైట్లీ అనేక సందర్భాల్లో బీజేపీకి న్యాయ సలహాదారుడిగా వ్యవహరించారు.

ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ భాజపా విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న అనంతరం ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. ఈ నెల 10నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటెన్‌ విడుదల చేయని వైద్యులు ఈ రోజు మధ్యాహ్నం ఆయన మృతిచెందినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.  అరుణ్‌ జైట్లీకి భార్య సంగీత, కుమార్తె సొనాలి జైట్లీభక్షి, కుమారుడు రోహన్‌ జైట్లీ ఉన్నారు.

Videos