ఢిల్లీ ఎన్నికల్లో ఇరగదీసిన బీజేపీ

కాలం ఎప్పుడూ ఒకేలా అస్సలు ఉండదు. అధికారం చేతికి రావటం ఎంత కష్టమో.. చేతికి వచ్చిన పవర్ ను చేజారకుండా ఉంచుకోవటం అంత తేలికైన విషయం కాదు. అందుకే ఓడిన వాడి కంటే విజయం సాధించిన వారు మరింత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని మరిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్ని ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ పాలకులకు తెలిసేటట్లు చేశారని చెప్పాలి. తాజాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాలక ఆమ్ ఆద్మీ పార్టీకి షాకిచ్చిన ఢిల్లీ ప్రజలు.. బీజేపీకి పవర్ ను పట్టం కట్టే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తీవ్ర కసరత్తు చేసి..బొక్కబోర్లా పడిన వేళ.. తాను అధికారంలో ఉన్న ఢిల్లీలోనూ తన పట్టును నిరూపించుకోలేని వైనం ఆయన పార్టీకి ప్రజల్లో తగ్గుతున్న పరపతిగా చెప్పక తప్పదు.

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాకిచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీ రాష్ట్రంలో ఏకంగా 57 స్థానాల్లో ఆమ్ ఆద్మీపార్టీ సంచలన విజయాన్ని సాధించగా.. కేవలం మూడంటే మూడు స్థానాల్లో మాత్రం బీజేపీ గెలవగలిగింది. ఇక.. కాంగ్రెస్ అయితే ఖాతానే తెరవని దుస్థితి.

ఇదంతా జరిగి దాదాపు రెండేళ్లకు పైనే అయిన వేళ.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు తాజాగా జరిగాయి. మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ స్పష్టమైన అధిక్యంలో దూసుకెళుతుండగా.. అధికార పార్టీకి ఘోర పరాజయం దిశగా అడుగులు పడుతున్నాయి. మొత్తం 272 స్థానాలకు 270 స్థానాల్లో ఎన్నికల్ని నిర్వహించారు.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం (ఉదయం 10 గంటల సమయానికి) బీజేపీ స్పష్టమైన అధిక్యత దిశగా దూసుకెళుతుండగా.. రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫలితాలు వెలువడిన తొలి గంటలో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలవగా.. ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానానికి దిగజారినట్లు కనిపించింది. అయితే.. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ.. ఆమ్ ఆద్మీ పుంజుకొని రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఈవీఎం వివాదాలు.. ఢిల్లీ అభివృద్ధి మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్న విమర్శలు.. ఆరోపణలు.. ఢిల్లీ ప్రజారోగ్యం విషయంలో అధికారపార్టీ విఫలం కావటం.. ఆమ్ ఆద్మీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న భావన వ్యక్తమవుతోంది.

మొత్తం 272 స్థానాలకు పోలింగ్ జరిగిన 270 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మూడు కార్పొరేషన్లలో పార్టీ అధిక్యాలు ఇలా ఉన్నాయి.

ఎంసీడీ నార్త్ లో 102 స్థానాలకు బీజేపీ 65.. కాంగ్రెస్ 19.. ఆమ్ ఆద్మీ 14.. ఇతరులు 4

ఎంసీడీ ఈస్ట్ లో 64 స్థానాలకు బీజేపీ 42.. ఆమ్ ఆద్మీ 11.. కాంగ్రెస్ 6.. ఇతరులు 4

ఎంసీడీ సౌత్ లో 102 స్థానాలకు బీజేపీ 64.. ఆమ్ ఆద్మీ 18.. కాంగ్రెస్ 12.. ఇతరులు 8

Videos

12 thoughts on “ఢిల్లీ ఎన్నికల్లో ఇరగదీసిన బీజేపీ

Leave a Reply

Your email address will not be published.