గన్నవరం ఎమ్మెల్యే పై కేసు నమోదు

గన్నవరం ఎమ్మెల్యే పై కేసు నమోదు
విజయవాడలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌కు, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు మధ్య ఉన్న విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చినట్లు భావిస్తున్నారు. వల్లభనేని వంశీపై పటమట పోలీసులు కేసు నమోదు చేయడంతో విజయవాడలో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు కావాల్సిన భూమిని సేకరించడానికి తమ గుడిసెలను అధికారులు తొలగించడానికి రావడంతో అక్కడి పేదలు అడ్డుకున్నారు. ఆ పేదలకు వంశీ అండగా నిలిచారు. దాంతో వంశీ అధికారుల విధుల నిర్వహణకు అడ్డు వచ్చారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి దేవినేని ఉమతో వంశీకి విభేదాలున్న విషయం అందరికీ తెలిసిందే. దేవినేని ఉమ తీసుకుంటున్న నిర్ణయాలను వంశీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి దెందులూరు, మైలరం నియోజకవర్గాల రైతు మోటార్లు ఉపయోగించి నీరు తీసుకున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలోని రైతుల పంటలను కాపాడేందుకు వంశీ పోలవరం కాలువకు మోటార్లు ఏర్పాటు చేశారు.
గన్నవరం రైతుల్లో వంశీకి బలం పెరుగుతోందని భావించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా నీటి పారుదల శాఖ అధికారులను ఉపయోగించి మోటార్లు తొలగించేందుకు ప్రయత్నించారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీన్ని వంశీ అడ్డుకున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని హెచ్చరించారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. అదే విధంగా పోలవరం కుడి కాలువ మట్టిని గన్నవరం నియోజకవర్గం రైతులు తమ పొలాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని జల వనరుల శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీని వెనక కూడా దేవినేని ఉమా హస్తం ఉందని వంశీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన రామవరప్పాడు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వంశీ అధిాకరులతో వివాదానికి దిగారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఇళ్లు తొలగిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆకస్మికంగా ఇళ్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వడాన్ని వంశీ ప్రశ్నిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *