బహిరంగ సభలోనూ జగన్ ఎమ్మెల్యే మైక్ కట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు తరచూ చోటు చేసుకునే ఘటన లాంటిదే కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ చోటు చేసుకుంది. విపక్షానికి చెందిన ఎమ్మెల్యే.. సీఎం పాల్గొన్న బహిరంగ సభ వేదిక మీద మాట్లాడిన మాటలు.. మంట పుట్టించటమే కాదు.. క్షణాల్లో మైకు కట్ చేయించిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసెంబ్లీలో మాదిరే.. బహిరంగ సభలోనూ మైక్ కట్ చేయాల్సిన పరిస్థితి అధికారపక్షానికి ఎందుకు ఏర్పడిందన్న విషయంలోకి వెళితే..

సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో పాల్గొనటం తెలిసిందే. శ్రీశైలం బ్యాక్ వాటర్ ను కర్నూలు – కడప కాలువకు మళ్లించేందుకు ఉద్దేశించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని.. స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రోటోకాల్ కారణంగా.. స్థానిక ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సభలో మాట్లాడేందుకు తనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) మాట్లాడుతూ.. ఏపీలోని ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భిక్షేనని వ్యాఖ్యానించారు. ముచ్చుమర్రి ప్రాజెక్టుకు.. పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది వైఎస్సేనని గుర్తుచేశారు. వైఎస్ హయాంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులను మీరిప్పుడు ప్రారంభిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

ఊహించని ఈ పరిణామం ఏపీ అధికారపక్ష నేతలకు ఇబ్బందికరంగా మారింది. వైఎస్ పేరును ఎమ్మెల్యే ఐజయ్య ప్రస్తావించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో.. మారిన పరిస్థితిని గుర్తించినఅధికారపక్ష ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి.. ఎస్వీ సుబ్బారెడ్డిలు ఎమ్మెల్యే ఐజయ్య చేతిలోని మైకును తీసుకోవటం.. దానికి కాస్త ముందు.. బహిరంగ సభలోరాజకీయాలా.. అంటూ ఐజయ్య మైకును కట్ చేయించారు.

తన మైక్ ను కట్ చేయించినప్పటికీ ఐజయ్య వెనక్కి తగ్గకుండా మాట్లాడుతున్న నేపథ్యంలో.. భూమా.. ఎస్వీలు రంగప్రవేశం చేసి.. ఆయన దగ్గరి మైకును తీసుకొని.. కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. ఇవన్నీ ఎన్టీఆర్ హయాంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులని.. వాటిని తానొచ్చి మళ్లీ ప్రారంభించానని.. ఇలా రాజకీయం చేయటం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *