అవినీతిలో నంబర్2 ర్యాంక్..బాబుకు కాలిపోయింది

దేశంలో అభివృద్ధిలో ఏపీని టాప్ లో నిలపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంటే వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఒకింత అవమానకరంగా మారుతుండటాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేసిన సర్వేలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉండటం పట్ల చంద్రబాబు తీవ్రంగా కలత చెందారు. పౌరసేవల కోసం టెక్నాలజీ ప్రవేశపెట్టడం పారదర్శక నిర్ణయాలతో ముందుకు సాగుతుంటే ఇదేం పరిస్థితి అంటూ అసహనం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో 13 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అల్పాహార విందు సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా అవినీతిపై అగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అవినీతిలో దేశవ్యాప్తంగా నంబర్ 2లో ఉన్న నేపథ్యంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవినీతికి పాల్పడే అధికారులు – సిబ్బంది ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. సిటిజన్ ఛార్టర్ను బలోపేతం చేయాలని ఆదేశించారు. మెజార్టీ పౌర సేవలను ఆన్ లైన్ చేయడం ద్వారా అవినీతిని తగ్గించాలని సూచించారు. కలెక్టర్లలో సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నవారిని వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు దాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా అత్యుత్తమ పాలన అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ వెళితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయన్నారు. అవినీతికి దూరంగా ఉండే రాష్ట్రంగా ఏపీ నిలవాలని ఆకాంక్షించారు.  రానున్న రెండేళ్లు ప్రభుత్వానికి కీలకమని ప్రజలను 80 శాతం సంతృప్తి పరచడమే ధ్యేయంగా పనిచేయాలని దీనికోసం అత్యవసర-స్వల్ప- దీర్ఘకాల విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ఇంటికీ గ్యాస్ – విద్యుత్ – మరుగుదొడ్లు – సిసి రహదారులు – మంచినీటి కుళాయి వంటి కనీస వసతులను కల్పించాలని ఆదేశించారు. రెండేళ్లలో సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై ఆయన చర్చించారు. సుస్థిర వృద్ధికి సంబంధించి 17 లక్ష్యాలను – సమాజం – కుటుంబ వికాస లక్ష్యాలు- జిఎస్ డిపికి అనుగుణంగా పాలన ఉండాలని ఆదేశించారు.

పరిపాలన విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మీకోసం పోర్టల్ – కాల్ సెంటర్ – కైజలా – ఎలక్ట్రానిక్ – ప్రింట్ మీడియాలపై ఆధారపడాలని చంద్రబాబు సూచించారు. సలహాలను – సమాచారాలను సేకరించి విశ్లేషణ చేయడం సమస్యలకు కారణాలు గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. దీనిద్వారా ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందన్నారు. గ్రామీణాభివృద్ధిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయానుబంధ రంగాల్లో 25 శాతం వృద్ధి సాధించాలని కోరారు. ఓడిఎఫ్ లో దేశంలో రాష్ట్రం ఆదర్శంగా మారేందుకు కలెక్టర్లు కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను జియో ట్యాగింగ్ చేయాలని విద్యాలాయల్లో బయోమెట్రిక్ అమర్చడం త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *