తొలి బాంబు ఉత్తరకొరియా వేస్తే ఓకే.. అమెరికా వేస్తే మాత్రం…

చైనా తన దుర్నీతిని మరోసారి బయటపెట్టుకుంది. ఉత్తరకొరియా, అమెరికాపై తొలి దాడి జరిపితే, తాము కల్పించుకోరాదని, అదే అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఉత్తరకొరియాపై గనుక దాడికి దిగితే అడ్డుకోవాలని చైనా భావిస్తోంది. ఈ విషయాన్ని చైనా అధికార దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ శుక్రవారం నాటి సంచికలో ప్రధానంగా ప్రచురించింది. అమెరికాపై ఉత్తర కొరియా అణు క్షిపణులు వేస్తే, చైనా మధ్యస్థంగానే ఉండాల్సిన అవసరం ఉందని ఆ పత్రిక పేర్కొంది.

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై కటువు వ్యాఖ్యలు చేసిన వేళ, చైనా ఈ తరహా కథనాన్ని ప్రచురించడం గమనార్హం. ఉత్తరకొరియాకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా, నమ్మకమైన మిత్రుడిగా చైనా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

వరుసగా క్షిపణి పరీక్షలు జరుపుతూ రెచ్చిపోతున్న ఉత్తరకొరియాను అదుపులో పెట్టేందుకు చైనా సహకరించాలని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కోరారు. అయితే, ఈ విషయంలో కూడా చైనా మొండిచేయే చూపించింది. ఉత్తరకొరియా అధినేత కిమ్ ను తాము అదుపు చేయలేమని, ఇదే సమయంలో పూర్తిగా స్నేహబంధాన్నీ తెంచుకోలేమని అది స్పష్టం చేసింది.

ఇక ఉత్తర కొరియా వద్ద ఉన్న ఆధునిక ఆయుధాల్లో కొన్ని చైనా ఇచ్చినవే. వాటిని చైనాయే ఆ దేశానికి విక్రయించింది కూడా. అయితే తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తాము కల్పించుకోరాదని చైనా భావిస్తోంది. ఒకవేళ అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఉత్తర కొరియాను పూర్తిగా ధ్వంసం చేయాలని భావిస్తే మాత్రం చైనా అడ్డుపడేలాగే ఉంది.

అణ్వాయుధాలు ప్రపంచానికి పెనుభూతంగా మారాయన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అసలు ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు అనేవి లేకుండా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా భూభాగంపై అణుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉత్తరకొరియా రెచ్చగొడుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *