తమ్ముళ్లకు క్లాస్ పీకిన బాబు!

‘ప్రభుత్వ వ్యూహాన్ని పార్టీ నేతలు అందుకోలేకపోతున్నారు. నాయకుల మధ్య సమన్వయం లోపించింది. నేను ఆశించినంత స్పీడుగా కడప నేతలు ఉండటం లేదు. ఎమ్మెల్యేలకు సహకారం అందించడంలో విఫలమవుతున్నారు. ఇన్‌చార్జి మంత్రి, జిల్లా అధ్యక్షుడి మధ్యే సమన్వయం లేదు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా తెలుగు తమ్ముళ్లకు తలంటు కార్యక్రమం చేపట్టారు. కడప పర్యటనలో భాగంగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం తెలుగుదేశంపార్టీ నేతలు, జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు… జిల్లాలో ఉంటూ విపక్షనేతకు దీటుగా స్పందించడంలో విఫలమవుతున్నారని తమ్ముళ్లపై సీఎం ధ్వజమెత్తారు.

ఎవ్వరికి వారే పెద్దలు అన్నట్లుగా వ్యవహరించడం మినహా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడు జిల్లాలో కరువయ్యారని సీఎం పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నుద్దేశించి గ్రూపులను ప్రోత్సహించడం మినహా సమన్వయంతో వ్యవహరించావా? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. పెద్దదిక్కులా ఉండే నాయకుడు ఒకరైనా ఉన్నారా?. జిల్లా అధ్యక్షుడు, ఇన్‌చార్జి మంత్రి మధ్య కూడా క్లారిటీ లేకపోతే ఎలా అంటూ గంటా శ్రీనివాసరావు, శ్రీనివాసులరెడ్డికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నా కొందరు అధికారులు తమ మాట పెడచెవిన పెడుతున్నారంటూ నేతలు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమగ్రమైన ఆధారాలుంటే ఇవ్వండని సీఎం కోరినట్లు సమాచారం.

ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాసంకల్పం కార్యక్రమం కడపలో నిర్వహించామని, ఆ మేరకు టీడీపీ నేతలుగా మీరంతా ఎందుకు చాలెంజ్‌గా తీసుకోలేకపోయారని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల్ని చైతన్యపర్చడంలో విఫలమవుతున్నారని, ఎవ్వరి పనులు వారు చూసుకోవడం మినహా పార్టీ కోసం కష్టపడే వారు ఈ జిల్లాలో కరువయ్యారని ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా కార్యక్రమం ఇక్కడే నిర్వహిస్తే, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారని తమ్ముళ్లను మందలించినట్లు సమాచారం. ప్రతి మూడు నెలలకు ఓమారు వస్తా, పార్టీని మరింత ఉన్నతికి తీసుకెళ్లేందుకు కృషి చేయండి, విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయండి, కష్టపడే వారికే పార్టీలో మనుగడ ఉంటుందని గట్టిగా పేర్కొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు సహకారం అందించడంలో జిల్లా టీడీపీ విఫలమవుతోందని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *