సీఎంఎస్ సర్వే బాబుకు షాక్

చంద్రబాబు రెండేళ్ల పాలనపై సీఎంఎస్ మార్చి నెలలో జరిపిన సర్వే ఫలితాలను సంస్థ అధినేత డాక్టర్ ఎన్.భాస్కర్ రావు  విడుదల చేశారు. ఇందులో బాబుకు కొంత మోదం కొంత ఖేధం ఉండటం ఆసక్తికరం.

రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ బాగా మెరుగుపడటం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నా ఉపాధి అవకాశాలు – ప్రభుత్వ సేవలు సక్రమంగా లేకపోవటం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. రైతుల రుణ మాఫీ – పింఛన్లు పెరగటం పట్ల ప్రజల్లో కొంత సంతృప్తి ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారని యువత అభిప్రాయపడుతున్నట్లు సర్వే తెలిపింది. అభివృద్ధి పథకాల అమలు విషయంలో కొన్ని జిల్లాలకు అధిక ప్రాధాన్యత లభించటం వలన రాష్ట్రం ఒకటిగా ఉండగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా మొత్తంమీద రాష్ట్రం భవిష్యత్తు భాగుంటుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు భాస్కర్ రావు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని అరికట్టకలుగుతుందని ప్రజలు విశ్వసించడం లేదు. చంద్రబాబు తన ఆస్తులు – అప్పుల వివరాలను వెల్లడించినా అవినీతిలో ఇతర రాష్ట్రాలతో పోటీపడుతోందని సర్వే చెబుతోంది.

రెండేళ్లనుండి అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతు మూటగట్టుకోవటంలో విఫలమయినట్లు సర్వే చెబుతోంది. రెవెన్యూ – పోలీసు శాఖలు అవినీతిమయం అయ్యాయని ప్రజలు భావిస్తున్నారు. విద్య – వైద్య – ఆరోగ్య రంగాల్లో కూడా అవినీతి బాగా పెరిగినట్లు సర్వే సూచిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ ఆర్ సీపీ కూడా రాజకీయంగా పెద్దగా పుంజుకోలేదు ప్రజల మద్దతు సంపాదించుకోవటంలో ఆ పార్టీ కూడా విజయం సాధించలేకపోతోందని సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం పూర్తిగా కోల్పోయినట్లేనని సర్వే తెలిపింది.

కొత్త రాజధాని నిర్మాణం పాలన విషయంలో చెబుతున్నది ఒకటి జరుగుతోంది మరొకటని ప్రజలు భావిస్తున్నట్లు సర్వే తెలిపింది. అదీగాక ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే పథకాలు బాగా అమలవుతున్నాయని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నట్లు చెబుతోంది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయగలుగుతారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన నడుస్తోందని ప్రజలు భావించటం లేదని సర్వే పేర్కొంది. పథకాల ప్రకటన ఉధృతంగా ఉన్నది తప్ప అమలు జరగడం లేదని ప్రజలు భావిస్తున్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు ప్రభుత్వం పని తీరును సమీక్షించేందుకు ఈ సర్వే జరిపినట్లు భాస్కర్ రావు వెల్లడించారు. చంద్రబాబు రాజకీయ ఎదుగుదల ఆగిపోయినా ఆ ఖాళీని భర్తీచేసే స్థాయికి వైఎస్ఆర్సిపి ఎదగలేకపోతోందని సర్వే సూచించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *