జేబులు జాగ్రత్త.. వరుసగా 5 రోజులు సెలవులే

ఈ మధ్యన బ్యాంకు సెలవులు ఎక్కువైపోతున్నాయి. ఏదో రూపేణ వస్తున్నసెలవులకు తోడుగా.. వారాంతపు సెలవులు కలవటంతో వరుస సెలవులు తరచూ వస్తున్నాయి. గతంలో నెలలో నాలుగు శనివారాలు బ్యాంకులు పనిచేసేవే. కానీ.. మారిన నిబంధనల పుణ్యమా అని.. రెండు శనివారాలు సాయంత్రం వరకూ పని చేసి.. మరో రెండు శనివారాలు (2..4 వారాలు) పూర్తిగా సెలవులు ప్రకటించటం.. ఆ తర్వాతి రోజు ఆదివారం కావటంతో ప్రజలు తెగ ఇబ్బందులు పడే పరిస్థితి.

బ్యాంకులకు సెలవుల కారణంగా.. బ్యాంకుల్లో పనులు ఉన్న వారు.. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నోళ్లకే కాదు.. ఏటీఎంల మీద ఆధారపడిన సగటు మనిషి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిపోయింది. గతంలో ఇంట్లో కాసిన్ని డబ్బులు పెట్టుకొని తిరిగేవారు.కానీ.. ఇప్పుడు పరిస్థితి మొత్తంగా మారిపోయింది. చాలా పరిమితంగా మాత్రమే క్యాష్ ను పర్సుల్లో ఉంచుకోవటం అలవాటైంది. ఏదైనా అవసరమైతే.. ఏదో ఒక ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితి.

అయితే.. ఒకటికి నాలుగు రోజుల పాటు వరుస సెలవులు వచ్చిన వేళ..ఏటీఎంలను క్యాష్ తో లోడ్ చేసే పరిస్థితి లేకపోవటంతో.. ఏటీఎంలు రెండో రోజుకే ఖాళీ అయ్యే పరిస్థితి. దీంతో.. జనాలు పడే ఇబ్బంది అంతా ఇంతాకాదు. తాజాగా వరుస 5 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చేయటంతో..సగటు జీవి తీవ్రంగా ప్రభావితం కానున్న పరిస్థితి. ఈ నెల 8 తేదీ నుంచి 12వతేదీ వరకూ వరుస సెలవులతో బ్యాంకులు మూత పడనున్నాయి.

మరీ.. అన్ని రోజులు ఎలా అంటారా? అక్కడికే వస్తున్నాం. ఈ నెల 8 (రెండో శనివారం).. 9 (ఆదివారం).. 10 (సోమవారం – ఆయుధ పూజ).. 11 (విజయదశిమి – మంగళవారం).. 12 (మెహర్రం – బుధవారం) సెలవులు రానున్నాయి. అన్ని బ్యాంకులకు ఇన్ని సెలవులు కాగా.. కొన్ని బ్యాంకులకు మాత్రం అయుధపూజ అయిన సోమవారం(అక్టోబరు10) సెలవు ఉండదని చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా.. పర్సుల్లో తగినంత క్యాష్ పెట్టుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *