రివ్యూ: మహిళా శక్తిని నిరూపించే “దంగల్”

కథ:
‘దంగల్’ ఓ విధంగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫిలిం. మరో విధంగా మహిళా శక్తిని నిరూపించే చిత్రం. ప్రత్యర్థిని మట్టి కరిపించే విజేత పడే శ్రమను ఇందులో చూపించారు. రెజ్లింగ్‌లో ప్రవేశించేందుకు మహిళలకు అనుమతి ఉండటం లేదని, వారికి అవకాశమిస్తే కుర్రాళ్ళతో సమానంగా విజయాలు సాధించగలరని నిరూపించే ప్రయత్నం జరిగింది. హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్‌ ఫోగట్‌ (అమీర్ ఖాన్) కుమార్తెలు గీత (ఫాతిమా సనా షేక్), బబిత (సాన్యా మల్హోత్రా)తో పాటు మరో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. వారిలో గీత, బబితలను ఆయన రెజ్లర్లుగా తీర్చిదిద్దుతారు. పురుషాధిపత్యం కొనసాగుతున్న రెజ్లింగ్‌లో మహిళల ప్రవేశిస్తే, ఘన విజయాలు సాధించగలరని నిరూపించడమే లక్ష్యంగా కథనం సాగింది.
విశ్లేషణ:
ఎన్ని కష్టాలను అనుభవించి అయినా గీత, బబితలను రెజ్లర్లుగా తీర్చిదిద్దడమే మహావీర్ లక్ష్యం. అదే దృఢ నిశ్చయంతో ఇద్దరికీ కుస్తీ నేర్పించాడు. ఆయన నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయలేదు. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు అనేక ఛాంపియన్‌షిప్స్‌లో విజేతలుగా నిలిచి తండ్రి గర్వపడేలా చేశారు. అంతకుమించి భారతదేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చారు. ఈ కథనం ద్వారా కుస్తీ క్రీడవైపు భారతీయ మహిళలను ప్రోత్సహించినట్లయింది. తండ్రీకూతుళ్ళ మధ్య జరిగే సంభాషణలు భావోద్వేగంతో పాటు హాస్యాన్ని కూడా పంచిపెట్టాయి
గీత, బబిత సాధిస్తున్న విజయాలను చూపించడమే కాకుండా, వాటి ద్వారా కుస్తీ పోటీలపట్ల ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు దేశభక్తిని ప్రేరేపించేవిధంగా చిత్రీకరణ జరిగింది. ముఖ్యంగా నటీనటుల అభినయానికి ఎక్కువ మార్కులు పడ్డాయి. 51 ఏళ్ళ వయసులో అమీర్ ఖాన్ ఇటువంటి ప్రయోగాలను చేయడం ప్రశంసించదగినదే. అమీర్ ఖాన్ పూర్తిగా పాత్రలో ఒదిగిపోయారు. తన రూపాన్ని పాత్రకు అనుగుణంగా మార్చుకున్నారు. నలుగురు కూతుళ్ళ తండ్రిగా చక్కగా అభినయించారు. ఆడపిల్లలు మగ పిల్లల కన్నా తక్కువేమీ కాదన్నది ఆ తండ్రి నమ్మకం. ఆయన భార్యగా నటించిన సాక్షితో పాటు ఫాతిమా, సాన్యా నటన కూడా ఆకట్టుకునేవిధంగా ఉంది.
సెకండాఫ్‌లో గీత, బబిత ఎక్కువసేపు కనిపిస్తారు. ఓడిపోవడం, గెలవడం గురించి వీరు నేర్చుకునే సన్నివేశాల్లో వారి నటన బాగుంది. మొత్తం సినిమాలో అక్కడక్కడా కాస్త స్తబ్ధుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లు రిపీట్ అయినట్లు ఉంటుంది. అయితే గీత, బబిత ఇంటా, బయటా వ్యవహరించే తీరును ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరించారు.

నటీనటులు: ఆమిర్ ఖాన్, సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా
దర్శకత్వం: నితీష్ తివారి
సంగీతం : ప్రీతమ్

రేటింగ్: 2.50/5

Videos

Leave a Reply

Your email address will not be published.