గుజరాత్‌పై ఢిల్లీ ప్రతీకార విజయం

సరిగ్గా వారం క్రితం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతంగా పోరాడినా గుజరాత్ లయన్స్ చేతిలో ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా డేర్‌డెవిల్స్ చెలరేగిపోయారు. బౌలర్ల సమష్టి కృషికి న్యాయం చేస్తూ… ఓపెనర్లు రిషబ్ పంత్ (40 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), డికాక్ (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో ఢిల్లీ ఎనిమిది వికెట్లతో గుజరాత్ లయన్స్‌ను ఓడించింది.

కెరీర్‌లో మూడో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రిషబ్ ఆది నుంచే దూకుడైన ఆటతీరుతో విజృంభించాడు. మరో ఓపెనర్ డికాక్(46) జతగా రిషబ్ చెలరేగాడు. తన ఇన్నింగ్స్‌లో 9ఫోర్లు, 2 భారీ సిక్స్‌లతో ఈ 18 ఏండ్ల కుర్రాడు కదంతొక్కాడు. ఈ క్రమంలో డికాక్‌తో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశాడు. జడేజా తొలి ఓవర్లో స్వీప్‌షాట్‌కు ప్రయత్నించిన రిషబ్..వికెట్‌కీపర్ కార్తీక్ క్యాచ్‌తో ఔటయ్యాడు. ఆ తర్వాత ఆరు పరుగుల తేడాతోనే డికాక్ నిష్క్రమించాడు. అయితే అప్పటికే గెలుపు ఖరారైన నేపథ్యంలో శాంసన్(19నాటౌట్), డుమిని(13 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. కౌశిక్(1/29), జడేజా(1/21) ఒక్కో వికెట్ దక్కింది. అర్ధసెంచరీతో జట్టు గెలుపులో కీలకమైన రిషబ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా… గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. ఫామ్‌లో ఉన్న విదేశీ స్టార్స్ డ్వేన్ స్మిత్ (15), మెకల్లమ్ (1), ఫించ్ (5) విఫలం కావడంతో నాలుగు ఓవర్లలోపే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రైనా (20 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) అండతో దినేశ్ కార్తీక్ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. కార్తీక్, జడేజా (26 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఐదో వికెట్‌కు 52 పరుగులు జతచేయడంతో గుజరాత్‌కు ఓ మాదిరి స్కోరు వచ్చింది. నదీమ్ రెండు వికెట్లు తీయగా… జహీర్, మోరిస్, షమీ, మిశ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.

స్కోరు వివరాలు:-

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) మోరిస్ (బి) నదీమ్ 15; మెకల్లమ్ (బి) జహీర్ 1; ఫించ్ (సి) పంత్ (బి) నదీమ్ 5; రైనా (స్టం) డికాక్ (బి) మిశ్రా 24; దినేశ్ కార్తీక్ (బి) షమీ 53; రవీంద్ర జడేజా నాటౌట్ 36; ఫాల్క్‌నర్ (బి) మోరిస్ 7; ఇషాన్ కిషన్ రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1-17; 2-17; 3-24; 4-75; 5-127; 6-138; 7-149.
బౌలింగ్: నదీమ్ 3-0-23-2; మోరిస్ 4-0-32-1; జహీర్ 4-0-27-1; షమీ 4-0-31-1; అమిత్ మిశ్రా 3-0-19-1; డుమిని 2-0-14-0.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) స్మిత్ (బి) కౌశిక్ 46; రిషబ్ పంత్ (సి) కార్తీక్ (బి) జడేజా 69; సంజు శామ్సన్ నాటౌట్ 19; డుమిని నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.2 ఓవర్లలో 2 వికెట్లకు) 150.  వికెట్ల పతనం: 1-115; 2-121.
బౌలింగ్: ప్రవీణ్ 2-0-20-0; ధావల్ 2-0-24-0; రైనా 4-0-34-0; కౌశిక్ 4-0-29-1; డ్వేన్ స్మిత్ 2-0-12-0; ఫాల్క్‌నర్ 1-0-9-0; జడేజా 2.2-0-21-1.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *