ఇదీ.. నెహ్రూ రాజకీయ ప్రయాణం!

బెజవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూ పేరు తెలియనివారు ఉండరు. విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం తెదేపాకు చేరి.. కాంగ్రెస్‌కు మారి.. మళ్లీ తెదేపాలోకి వచ్చారు. దేవినేని నెహ్రూగా సుపరిచితులైన ఆయన అసలు పేరు దేవినేని రాజశేఖర్‌. ఎన్టీఆర్‌ అత్యంత నమ్మకస్తుడిగా.. వీరవిధేయుడిగా నెహ్రూకు పేరుంది.

1954 జూన్‌ 22న విజయవాడ సమీపంలోని కంకిపాడు మండలం నెప్పల్లిలో దేవినేని రామకృష్ణ వరప్రసాద్‌, రాధాకృష్ణమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. అయనకు గాంధీ( చంద్రశేఖర్‌), మురళీ, బాజీప్రసాద్‌ సోదరులు. బీఏ వరకు చదివిన నెహ్రూ.. తర్వాత వ్యవసాయ వృత్తి చేపట్టారు. ఆయనకు లక్ష్మితో వివాహం జరిగింది. ఆయనకు ఒక కుమారుడు.. కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు దేవినేని అవినాష్‌ తండ్రికి రాజకీయ వారసుడిగా వ్యవహరిస్తున్నారు.

విద్యార్థి రాజకీయాల్లో..
నెహ్రూ స్వతహగా రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆయన తాత సూర్యనారాయణ నెప్పల్లి సర్పంచిగా పనిచేశారు. విద్యార్థి రాజకీయాల్లో నెహ్రూ చురుగ్గా పాల్గొనేవారు. ఆయన ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో చదువుతుండగానే యూనైటెడ్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థకు వంగవీటి రాధ ఆధ్వర్యంలోని యూఐతో ఆధిపత్యపోరు నడిచేది. తర్వాత 1982లో తెదేపా ప్రారంభంతో నెహ్రూ అందులో చేరారు. అలా ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది.

తెదేపా నుంచి కాంగ్రెస్‌కు..
ఎన్టీఆర్‌కు వీర విధేయుడిగా దేవినేని నెహ్రూకు పేరుంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఐదు పర్యాయల్లో నాలుగుసార్లు ఎన్టీఆర్‌ హాయంలోని తెలుగుదేశం పార్టీ నుంచే కావడం గమనార్హం. 1983లో తొలిసారి కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన విజయపరంపర కొనసాగింది. 1983 నుంచి 1994 వరకు వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. 1994 నుంచి 96వరకు ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో పని చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి యలమంచిలి నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2004లో వైఎస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లోనూ ఆయనకు ఓటమి తప్పలేదు. విభజన కారణంగా ఏర్పడిన వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆయనకు స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోయారు.

ఎన్టీఆర్‌ సన్నిహితుడిగా..
దేవినేని నెహ్రూ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ఎన్టీఆర్‌ను అనుంగ సహచరుడిగానే మెలిగారు. తెదేపా తొలిసారి ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్‌ తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని నెహ్రూ తరచూ చెబుతుంటారు. తనకు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని తండ్రీకొడుకుల అనుబంధంతో పోల్చి చెప్పేవారు. 1989లో తెదేపా ఓటమికున్న కారణాల్లో నెహ్రూ కూడా ఒకరనే ఆరోపణలు వచ్చినా ఎన్టీఆర్‌ ఆయన్ను వదులుకోలేదు. అంతటి సాన్నిహిత్యం ఎన్టీఆర్‌తో నెహూకు ఉండేది. 1996లో తెదేపాలో చోటుచేసుకున్న మార్పుల్లో ఆయన ఎన్టీఆర్‌ పక్షానే నిలిచారు.

ఎన్టీఆర్‌ మరణానంతరం పీజేఆర్‌.. ఇతర కాంగ్రెస్‌ నేతల ప్రోత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004లో ఆయన మరోసారి కంకిపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున గెలిచారు. 2009.. 2014లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మధ్యనే తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తన కుమారుడు దేవినేని అవినాష్‌ను వారసుడిగా ప్రకటించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ.. అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *