దివాకర్ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం. 11మంది మృతి

పాడు బస్సు ప్రాణాలు తీసింది. బస్సు డ్రైవర్ మీద ప్రయాణికులకు ఉండే నమ్మకంతో నిద్ర పోతున్న వారిలో 11 మంది శాశ్విత నిద్రలోకి జారిపోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో  బస్సు కృష్ణా జిల్లాలో తీవ్ర ప్రమాదానికి గురైంది. ఈ ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్దకు వచ్చిన బస్సు.. నేషనల్ హైవే మీదున్న డివైడర్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు బ్యాలెన్స్ తప్పి.. పక్కనే ఉన్న కల్వర్టులోకి పడిపోయింది.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా గాయపడినట్లుగా చెబుతున్నారు. బస్సులో మొత్తం 44 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. పెనుగంచిప్రోలు.. నందిగామ పోలీసులు.. గ్రామస్థులు ప్రమాదస్థలికి చేరుకొని సాయం చేస్తున్నారు.

గాయపడిన వారిని బస్సులో నుంచి బయటకు తీసి.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. రెండు కల్వర్టుల మధ్య బస్సు ఇరుక్కుపోవటంతో.. బస్సును బయటకు తీయటం ఇబ్బందిగా మారింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు ముందు భాగమంతా నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం.. బస్సు అమితమైన వేగంతో ఉండటమే కారణంగా చెబుతున్నారు.

మరోవైపు మరణించిన మృతులు ఎవరన్న విషయం మీద స్పష్టత రావటం లేదు. ఎక్కువమంది విశాఖకు చెందిన వారే ఉంటారన్న మాట వినిపిస్తోంది. ప్రమాదంపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించి.. ప్రమాదానికి దారి తీసిన కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని.. మృతదేహాల్ని వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నందిగామ.. జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యల్ని సమీక్షించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *