రివ్యూ: ‘ద్వారక’తో కాలక్షేపం చేయొచ్చు

హీరో (విజయ్‌ దేవరకొండ) దొంగ. స్నేహితులతో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ద్వారక అనే అపార్ట్‌మెంట్‌కు దొంగతానికి వెళ్తాడు. అనుకోని సంఘటనల్లో హీరో బాబాగా మారాల్సి వస్తుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఆయనకో చిన్న సైజు గుడి కడతారు. పూజలు.. కానుకలు.. దీవెనలతో పాపులర్‌ అయిపోతాడు. మీడియా కూడా బాబాకి కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తుంది. హీరో కొన్ని రోజులు ఈ నాటకం ఇలాగే కొనసాగించి డబ్బులు సంపాదించాలని భావిస్తాడు.
ఈ క్రమంలో హీరో ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కాలేదంటూ ఆమె తల్లిదండ్రులు బాబాగా ఉన్న ఆయన వద్దకే తీసుకువస్తారు. కానీ హీరోయిన్‌కు హీరోపై ఏ మాత్రం నమ్మకం ఉండదు. ఈ బాబాను అడ్డుపెట్టుకుని ఓ ట్రస్టుకు అందాల్సిన రూ.2వేల కోట్లను స్వాధీనం చేసుకోవాలని ఒక ముఠా ప్రయత్నిస్తుంది. హీరో బాబా కాదని నిరూపించడానికి ఓ నాస్తికుడు వస్తాడు. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి.. మరోవైపు ముఠా.. ఇంకోవైపు నాస్తికుడు.. వీరి మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? బాబా నాటకానికి ఎలా తెరదించాడు అనేదే ద్వారకను చూసి తెలుసుకోవాల్సిందే.

దొంగ శీను.. బాబాగా మారే క్రమం.. బాబాగా చేసే విన్యాసాలు.. మూఢ భక్తి.. మీడియా చేసే హంగామా.. వీటితో కూడిన సన్నివేశాలతో సినిమా హుషారుగా సాగుతుంది. బాబా గుట్టురట్టు చేయడానికి వచ్చిన మురళీశర్మ ఎంట్రీతో కథ మరింతగా రక్తికడుతుంది. కథానాయకుడు దొరికిపోతాడా.. లేదా? అనే ఆసక్తిని ప్రేక్షకులకు కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యారు. కథలో కొత్తదనం లేకపోయినా.. ట్రీట్‌మెంట్‌తో సినిమాని ముందుకు నడిపించారు.
పృథ్వీ చేసే కామెడీ చిత్రానికి బలం. విశ్రాంతికి ముందు సినిమా కాస్త నెమ్మదిగా సాగినా.. విశ్రాంతి ఘట్టం వద్ద మళ్లీ పుంజుకుంటుంది. ద్వితీయార్థంలో కథగా చెప్పడానికి దర్శకుడి దగ్గర ఏమీ మిగలదు. అందుకే అక్కడ కూడా వినోదాన్ని నమ్ముకున్నారు.
పతాక సన్నివేశాల్లో ఏం జరగబోతోంది? అనేది ప్రేక్షకుడు ముందుగానే వూహిస్తాడు. అయితే ప్రకాశ్‌రాజ్‌ పాత్రను చాలా తెలివిగా డీల్‌ చేయడంతో ఉత్కంఠ మొదలవుతుంది. చిన్నచిన్న పాత్రలకు కూడా పేరున్న నటీనటులను ఎంచుకోవడం.. సంభాషణలు వైవిధ్యంగా రాసుకోవడంతో సన్నివేశాలన్నీ ఫర్వాలేదనిపిస్తాయి. హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌.. కథా నాయకుడు- ప్రతి నాయకుడుకి మధ్య ఘర్షణ సన్నివేశాలపై మరికాస్త దృష్టి సారిస్తే బావుండేది. అయినా ‘ద్వారక’ కాలక్షేపానికి ఢోకా ఉండదు.
ఎవరెలా చేశారంటే?: ‘పెళ్లిచూపులు’ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా ఇది. ఈ రెండు సినిమాల మధ్య నటనలో వ్యత్యాసం చూపించగలిగాడు విజయ్‌. పాత్రకు తగ్గట్టు హుషారుగా నటించారు. వినోదం చేయగలనని నిరూపించుకున్నారు. కథనాయిక పాత్రకు అంతగా స్కోప్‌ లేదు. కానీ ఉన్నంతలో తను కూడా మెప్పించారు. మురళీ శర్మ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. పృథ్వీతో సహా కామెడీ గ్యాంగ్‌ అంతానవ్వులు పంచింది. ప్రకాశ్‌రాజ్‌ పాత్ర నిడివి తక్కువే అయినా ఆ పాత్రను కథలో కీలకం చేసుకున్నారు దర్శకుడు. పాటలు వినడానికి ఓకే అనిపిస్తాయి. చిత్రీకరణ పరంగా ఎక్కువ మార్కులు పడతాయి. విజువల్‌గా సినిమా రిచ్‌గా చూపించారు. కథ పరంగా వైవిధ్యం లేకున్నా కథనంతో ఆకట్టుకునేలా ఉంది.

బలాలు
* విజయ్‌ దేవరకొండ
* వినోదం
* దొంగబాబా లీలలు
బలహీనతలు
* అక్కడక్కడా నెమ్మదించటం
* సరైన ప్రతినాయకుడు లేకపోవడం

చిత్రం పేరు: ద్వారక
రేటింగ్: 3/5
నటీనటులు: విజయ్‌ దేవరకొండ.. పూజా ఝవేరీ.. ప్రకాశ్‌రాజ్‌.. మురళీ శర్మ.. పృథ్వీరాజ్‌ తదితరులు
సంగీతం: సాయికార్తీక్‌
నిర్మాణ సంస్థ: లెజెండ్‌ సినిమా
దర్శకుడు: శ్రీనివాస్‌ రవీంద్ర

Videos

Leave a Reply

Your email address will not be published.