‘ఎవరు’ మూవీ రివ్యూ

క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయం రీసెంట్‌గా క్షణం, గూఢచారి సినిమాలు రుజువు చేశాయి. ఆ రెండు సినిమాలు కూడా అడివి శేషు హీరోగా రావడంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవరు మూవీపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే రెజీనా కసండ్రా ఉండటంతో మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. పీవీపీ బ్యానర్ ఈ సినిమాను రూపొందించడం మరింత ఆకర్షణగా మారింది.
కథ:

ఓ హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్‌ మహా భార్య, సమీరా మహా(రెజిన) డీసీపీ అశోక్‌ (నవీన్‌ చంద్ర)ను కాల్చి చంపేస్తుంది. హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే అశోక్‌, తమిళనాడు.. కూనుర్‌లోని ఓ రిసార్ట్‌లో హత్యకు గురికావటంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. చనిపోయింది డిపార్ట్‌మెంట్ వ్యక్తి కావటంతో పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకుంటారు. సమీరాపై హత్య కేసు పెడతారు. సమీరా మాత్రం అశోక్‌ తనపై అత్యాచారం చేయటంతో ఆత్మరక్షణ కోసం చంపానని వాదిస్తుంది.

మరోవైపు కూనూర్ ప్రాంతంలో రిసార్ట్స్ నిర్వహించే వినయ్ వర్మ (మురళీ శర్మ) కనిపించకుండా పోతారు. అతన్ని వెతుక్కుంటూ క్యాన్సర్‌తో బాధపడే ఆయన కొడుకు రాహుల్ (నిహాల్) పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు. అదే స్టేషన్‌లో ఎస్‌.ఐగా పనిచేస్తుంటాడు విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్). డబ్బు ఇస్తే ఎలాంటి పనినైనే చేసే లంచావతారం విక్రమ్ వాసుదేవ్.. వినయ్ వర్మ కేసును డీల్ చేయడానికి రాహుల్ దగ్గర లంచం తీసుకుంటాడు. ఈ కేసుకి సమీరా కేసుకి లింకేంటి? అసలు విక్రమ్ వాసుదేవ్ ‘ఎవరు’? వినయ్ వర్మ ‘ఎవరు’? రాహుల్ ‘ఎవరు’? సమీరాని రేప్ చేసింది ‘ఎవరు’? అశోక్‌ని హత్య చేసింది ‘ఎవరు’? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ఎవరు’? చిత్రం.

విశ్లేషణ:

‘ఎవరు’ సినిమా ప్రశ్నలతోనే మొదలౌతోంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్లే కొలదీ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, సర్ ప్రైజ్‌లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ‘ఎవరు’ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్‌గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి కథ కొసరంతే ఉన్నా.. కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంటాయి. ఈ ‘ఎవరు’ కథ కూడా ఈ కోవలోనిదే. కథ మొత్తం స్క్రీన్ ప్లే మాయాజాలంతో సాగుతుంది. చాలా సన్నివేశాలు రెండు మూడు కోణాల్లో చూపించినా ఎక్కడ బోర్‌ అనిపించకుండా తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేశాడు శేష్‌. కానీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్‌ హాఫ్ అంత గ్రిప్పింగ్‌గా అనిపించదు. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకల సంగీతం. పాటలు కథలో భాగం వచ్చిపోతాయి. నేపథ్య సంగీతంతో ప్రతీ సన్నివేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. వంశీ పచ్చిపులుసు తన కెమెరా పనితనంతో థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన సీరియస్‌నెస్‌ను తీసుకువచ్చాడు.

ప్లస్ పాయింట్స్:  కథనం, థ్రిల్లింగ్ అంశాలు,నేపధ్య సంగీతం

నెగెటివ్ పాయింట్స్: కమర్షియల్ ఎలిమెంట్స్‌ లేకపోవటం

 

టైటిల్: ఎవరు

రేటింగ్: 3.5/5

తారాగణం: అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ

సమర్పణ: హావీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్

దర్శకత్వం: వెంకట్‌ రామ్‌జీ

సంగీతం: శ్రీ చరణ్‌ పాకల

నిర్మాత: పీవీపీ

 

Videos

6 thoughts on “‘ఎవరు’ మూవీ రివ్యూ

Leave a Reply

Your email address will not be published.