ఢాకాలో కాల్పులు విదేశీయులు సహా పలువురి నిర్బంధం

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం సాయుధ దుండగుల దాడి సంచలనం కలిగించింది. సాయుధులు గుల్షన్ ఏరియాలోని హోలీ ఆర్టిజాన్ బేకరీ రెస్టారెంట్‌లోకి ప్రవేశించి బాంబులు విసురుతూ కాల్పులు కొనసాగించారు. ఇందులో ఒక పోలీసు చనిపోగా, 20 మంది విదేశీయులు సహా దాదాపు 60 మందిని సాయుధులు నిర్బంధంలోకి తీసుకున్నారని తెలుస్తున్నది. వారిలో కొందరు దౌత్యాధికారులున్నట్లు భావిస్తున్నారు. పోలీసులతో పాటు బంగ్లాదేశ్ భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సాయుధులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

రెండు వైపుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు సహా నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరు అర్ధరాత్రి సమయంలో మరణించారు. అల్లా హో అక్బర్ అంటూ సాయుధులు కాల్పులు సాగించినట్లు తెలుస్తున్నది. మొత్తంగా ఆరు నుంచి ఎనిమిది మంది ఉండొచ్చని భావిస్తున్నారు. రాత్రి 9.20 గంటల సమయంలో ఐదుగురు సాయుధులు.. విదేశీయులు ఎక్కువగా సందర్శించే బేకరీ, రెస్టారెంట్‌లో ప్రవేశించి కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఇటాలియన్లు చనిపోయారని, ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు గాయపడ్డారని తొలుత వార్తలొచ్చాయి. సాయుధులు 20 మందిని బందీలుగా తీసుకున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ పత్రిక పేర్కొన్నప్పటికీ అధికారవర్గాలు నిర్ధారించలేదు. కాల్పులు జరిగినట్లు, బందీలుగా పట్టుకున్నట్లు వార్తలందుతున్నాయి అని ఢాకాలోని అమెరికా దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది.

ఇండియన్ హై కమిషన్ అధికారులంతా సురక్షితంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పరిస్థితిని గమనిస్తున్నట్లు ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. సాయుధ దుండగులు ఎవరనేది స్పష్టం కానప్పటికీ, ఇస్లామిక్ మిలిటెంట్లే కావచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు. బంగ్లాదేశ్‌లో మిలిటెంట్లు కొన్ని నెలలుగా మైనారిటీలను, ఉదారవాద ఆలోచనాపరులను లక్ష్యంగా పెట్టుకుని దాడులకు దిగుతున్నారు. దాడికి పాల్పడిన సాయుధులు అల్లా హో అక్బర్ అంటూ నినదించడంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *