చెలరేగిన కోహ్లీ.. తొలిరోజు స్కోరు 302/4

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అజేయ శతకం (143 పరుగులు; 197 బంతుల్లో 16 ఫోర్లు)తో చెలరేగిపోయాడు. దీంతో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు నిర్ణీత ఓవర్లు ఆడిన భారత్ మ్యాచ్ ముగిసే సమయానికి  4 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన బ్యాటింగ్ లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.

రాణించిన ధావన్

పిచ్ బ్యాటింగ్కు అనుకూలించని పరిస్థితుల్లో ఓపెనర్ శిఖర్ ధావన్(84; 147 బంతుల్లో 9 ఫోర్లు; 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్(7), వన్ డౌన్ బ్యాట్స్ మన్ చతేశ్వర్ పుజారా(16) విఫలమయ్యారు. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్ పేస్‌తో ధావన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. దీంతో రెండు, మూడుసార్లు బంతి ఎడ్జ్ తీసుకున్నా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లకపోవడంతో ధావన్ ఊపిరి పీల్చుకున్నాడు.

విండీస్ పేసర్ గాబ్రియెల్ ఏడో ఓవర్‌లో అద్భుతమైన బౌన్సర్‌తో విజయ్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో భారత్ 14 పరుగుల వద్ద తొలి వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత ధావన్, పుజారా చాలా నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుకు పరుగులు జతచేశారు. అయితే లంచ్ తర్వాత భారత్‌కు ఊహించని దెబ్బ తగిలింది. స్పిన్నర్ బిషూ వేసిన షార్ట్ పిచ్ బంతి పుజారా బ్యాట్‌ను తాకుతూ బ్రాత్‌వైట్ చేతిలోకి వెళ్లింది. దీంతో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

74 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో పుజారా నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధావన్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లీ అద్భుత శతకం (143 పరుగులు; 197 బంతుల్లో 16 ఫోర్లు) చేసి అజేయంగా నిలవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. టెస్టుల్లో కోహ్లీకిది 12వ శతకం. ధావన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(22 పరుగులు ; 4 ఫోర్లు) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ కోహ్లీతో పాటు అశ్విన్(22) క్రీజులో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో బిషూ 3 పడగొట్టగా, గాబ్రియెల్ ఒక్క వికెట్ తీశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *