పిచ్‌పైకి దూసుకొచ్చిన కారు..త్రుటిలో ప్రమాదం తప్పించుకున్న గంభీర్‌

అది దిల్లీలోని పాలెం ఎయిర్‌ఫోర్స్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని క్రికెట్‌ మైదానం. అప్పుడు సమయం 4 గంటల 40 నిమిషాలు. దిల్లీ-ఉత్తరప్రదేశ్‌ మధ్య రంజీ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. అప్పటికే మ్యాచ్‌ ముగియాల్సి ఉన్నా.. నిర్ణీత సమయానికి ఓవర్ల కోటా పూర్తి కాకపోవడంతో అంపైర్లు ఆటను పొడిగించారు. ఇంకో 20 నిమిషాల్లో ఆటకు తెరపడాల్సి ఉండగా.. అందరూ ఆట మీదే దృష్టి పెట్టి ఉన్నారు. అప్పుడే ఒక కారు అనూహ్యంగా మైదానంలోకి దూసుకొచ్చింది. ఆటగాళ్లు, అంపైర్లు ఆపుతున్నా ఆ కారులోని వ్యక్తి వినిపించుకోలేదు. నేరుగా పిచ్‌ మీదికి కారును నడిపించాడు. అక్కడే ఒకటికి రెండు రౌండ్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు. భద్రత సిబ్బంది అతి కష్టం మీద అతడిని అడ్డగించి పోలీసులకు అప్పగించారు. గంభీర్‌, ఇషాంత్‌, రైనా లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లున్న మైదానంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా క్రికెట్‌ వర్గాల్లో కలకలం రేపింది.

దిల్లీ-ఉత్తరప్రదేశ్‌-దిల్లీ రంజీ మ్యాచ్‌ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దిల్లీలోని పాలెం మైదానంలో ఆట సాగుతున్న సమయంలో ఓ వ్యక్తి కారులో మైదానంలోకి వచ్చేశాడు. పిచ్‌ మీద ఒకటికి రెండుసార్లు కారును నడిపించి.. ఆటకు అంతరాయం కలిగించాడు. ఈ మ్యాచ్‌లో గౌతమ్‌ గంభీర్‌, ఇషాంత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌ దిల్లీకి ఆడుతుండగా.. మరో టీమ్‌ఇండియా ఆటగాడు యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కారులో ఉన్న వ్యక్తిని గిరీశ్‌ శర్మగా గుర్తించారు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా శుక్రవారం ఆటను పొడిగించిన అదనపు సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీని వల్ల ఆటను అప్పటికప్పుడు ఆపేయాల్సి వచ్చింది. గిరీశ్‌ ఓ దశలో కారును ఆటగాళ్ల మీదికి కూడా పోనిచ్చాడు. ఆ సమయంలో గంభీర్‌ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.

గిరీశ్‌ కారుతో మైదానంలోకి వచ్చే సమయంలో గేటు వద్ద భద్రత సిబ్బంది అప్రమత్తంగా లేనట్లు తెలుస్తోంది. అతను తిరిగి వెళ్లేటపుడు మాత్రం సిబ్బంది అడ్డుకుని అతడికి దేహశుద్ధి చేశారు. ముందుగా వైమానిక దళానికి చెందిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని, తర్వాత దిల్లీ పోలీసులకు అప్పగించారు. దిల్లీలో ఫిరోజ్‌ షా కోట్లా లాంటి అంతర్జాతీయ మైదానం ఉన్నప్పటికీ, బుధవారం అక్కడ టీ20 మ్యాచ్‌ జరగడంతో రంజీ మ్యాచ్‌ కోసం వైమానిక దళానికి చెందిన పాలెం మైదానాన్ని ఎంచుకున్నారు. దీనికి చుట్టూ పూర్తి స్థాయిలో హద్దులు లేకపోవడంతో లోనికి కారు వచ్చేసినట్లు భావిస్తున్నారు. కారణాలేవైనా ఓ రంజీ మ్యాచ్‌ జరుగుతున్న మైదానంలోకి ఇలా కారుతో వచ్చి, పిచ్‌ మీద రౌండ్లు కొట్టడం భారత క్రికెట్‌ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన బీసీసీఐ దృష్టికి రావడంతో మ్యాచ్‌ అధికారుల్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

స్నేహితుడి కోసం చేశాడా?
గిరీశ్‌ శర్మ తన స్నేహితుడికి జరిగిన అవమానానికి ప్రతీకారంగానే ఇలా ప్రవర్తించినట్లు మైదాన సిబ్బంది ఒకరు తెలిపారు. ‘‘ఉదయం ఒక అభిమాని స్టేడియం గోడపై నుంచి దూకి మైదానంలోకి చొరబడే ప్రయత్నం చేశాడు. అతడిని ఓ అధికారి కొట్టి పంపించాడు. అతను ఈ గిరీశ్‌కు స్నేహితుడు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికే అతనిలా చేశాడు’’ అని అతనన్నాడు. ఐతే గిరీశ్‌ మాత్రం అదంతా అబద్ధమని అన్నాడు.

ఇదీ అతడి వాదన..
‘‘నా సోదరిని విమానాశ్రయంలో దించి తిరిగొస్తుండగా.. పాలెం మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నట్లు తెలిసింది. కాసేపు మ్యాచ్‌ చూద్దామనిపించింది. ఐతే గేటు వద్ద భద్రత సిబ్బంది ఎవరూ లేకపోవడంతో లోపలికెళ్లి ఆటగాళ్లను కలుద్దామనుకున్నా. కానీ కారును ఎక్కడ ఆపాలనే విషయంలో నాకెవ్వరూ సూచనలు ఇవ్వకపోవడంతో మైదానంలోనే ఆపే ప్రయత్నం చేశా’’

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *