గ్రూప్‌-3 నోటిఫికేషన్‌తో ఏపీపీఎస్సీ బోణీ?

గ్రూప్‌-3 సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం ద్వారా కొత్త ఉద్యోగాల ప్రకటనల పర్వానికి శ్రీకారం చుట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఖాళీగా 1000 కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా తాజాగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పోస్టులు గ్రూప్‌-3 సర్వీసెస్ లో ఉన్నాయి. ఎలాంటి వివాదాలు లేని ఈ పోస్టుల భర్తీకి తొలుత నోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా నిరుద్యోగులకు భరోసా లభిస్తుందని ఏపీపీఎస్సీ భావిస్తోంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే ముందు న్యాయపరమైన, సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని కమిషన్‌ భావిస్తోంది. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ తాలూకు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.
సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి తదుపరి అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ నవ్యాంధ్రప్రదేశ్‌లో 94 పోస్టులను గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ముందుగా ఈ నోటిఫికేషన్‌ ఇస్తే.. పాత నోటిఫికేషన్‌కు సంబంధించిన అభ్యర్థులు ఎలా స్పందిస్తారు, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయా అన్న కోణంలో ఏపీపీఎస్సీ తర్జన భర్జన పడుతోంది. ఇక గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలకు ముందుగానే.. జీ.వో.నెం. 622, 623ల అమలుపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. సున్నితమైన ఈ అంశంపై స్పష్టత వచ్చేందుకు కొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ఆర్థికశాఖ అనుమతిచ్చిన మొత్తం పోస్టుల్లో పంచాయతీ కార్యదర్శుల పోస్టులే ఎక్కువగా ఉండటంతో ముందుగా వీటిపై దృష్టి సారించింది. ఈ ఉద్యోగాలకు ఏదేని డిగ్రీ పూర్తి చేసిన వారికి అర్హత ఉన్న దృష్ట్యా.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారని ఏపీపీఎస్సీ వర్గాల అంచనా. రాత పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి ఈ కొలువులు లభిస్తాయి కాబట్టి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 సర్వీసె్‌సలకు సంబంధించిన పరీక్షల సిలబ్‌సలో మార్పులు, చేర్పులు, తొలగింపులపై ఏపీపీఎస్సీ కసరత్తు చేపట్టింది. నేడో, రేపు తుది సిలబ్‌సను ప్రకటించేందుకు సిద్ధమైంది. కానీ గ్రూప్‌-3 సర్వీసెస్‌ సిలబ్‌సపై ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. పాత సిలబస్‌ ఉంది. ప్రభుత్వం గ్రూప్‌-3 సర్వీసెస్‌ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో స్పందించిన ఏపీపీఎస్సీ.. గ్రూప్‌-3 సిలబ్‌సలో అవసరమైన మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. సాధ్యమైనంత త్వరగా కొత్త సిలబ్‌సను విడుదల చేసి నోటిఫికేషన్‌కు మార్గం సుగమం చేస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుంటారు కాబట్టి ఫిల్టరేషన్‌ కోసం స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి పరిమిత సంఖ్యలో ఎంపిక చేసిన వారికి మెయిన్‌ పరీక్ష నిర్వహించే అంశం కూడా ఏపీపీఎస్సీ పరిశీలనలో ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *