నేడో రేపో గ్రూప్‌–3

రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులు సహా వివిధ శాఖలకు చెందిన 611 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో గ్రూప్‌–3 నోటిఫికేషన్‌ కూడా వెలువరించనుంది. బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టులకు గురువారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి ఒక ప్రకటనలో తెలిపారు. 2017 జనవరి 28వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందన్నారు. ఈ పోస్టులకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా నోటిఫికేషన్లతో పాటే గ్రూప్‌–3 నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయాలని ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసినా, చివరి నిమిషంలో నిలిచిపోయింది. గ్రూప్‌–3 కింద 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అత్యధిక సంఖ్యలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశమున్నందున వడపోతలో కొత్త విధానాన్ని పాటించాలని ఏపీపీఎస్సీ భావించింది. యూపీఎస్సీ తదితర సంస్థల తరహాలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు రిజర్వేషన్లు పాటిస్తూ 1:12 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయడానికి తమకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తుందని కొంత కాలంగా ఏపీపీఎస్సీ ఎదురు చూస్తోంది. బుధవారం వరకు ఎదురు చూసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాక పోవడంతో గ్రూప్‌–3ని మినహాయించి తక్కిన వాటికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నేడు, రేపు ఏఈఈ మెయిన్స్‌
ఇదిలా ఉండగా వివిధ విభాగాల్లోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులకు మెయిన్స్‌ పరీక్ష గురు, శుక్రవారాల్లో జరుగుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీసాయి తెలిపారు. ఏపీలోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ పరీక్షల కోసం మొత్తం 131 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published.