ఏడు రోజులు..8.5 కోట్లు మొక్కలు

తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునకు అనూహ్య స్పందన వస్తున్నది. గతంలో ప్రభుత్వం ఏ పిలుపు ఇచ్చినా.. అది ప్రభుత్వ వర్గాలకే పరిమితమయ్యేది.. కానీ, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పరిస్థితుల్లో పూర్తి మార్పు కనిపిస్తున్నది. ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పండుగగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇందుకు హరితహారం కార్యక్రమం తాజా ఉదాహరణ.

ఈ నెల 8వ తేదీన హరితహారం కార్యక్రమం ప్రారంభం కాగా, తొలివారంలో రాష్ట్రవ్యాప్తంగా 8.5కోట్ల మొక్కలను నాటడం విశేషం. ప్రభుత్వ సంస్థలు 6.5 కోట్ల మొక్కలు నాటగా, ఇంటింటికీ మొక్కలు కార్యక్రమంలో ప్రజలు 2 కోట్ల మొక్కలు తీసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజైన గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1.16కోట్ల మొక్కలను నాటారు. తెలంగాణకు హరితహారం-బంగరు భవితకు సోపానం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో మంత్రులు, నేతలు, అధికారులు, ప్రజలు ఉద్యమంలా ముందుకు సాగుతున్నారు. 10 లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర పోలీసు శాఖ లక్ష్యంగా పెట్టుకోగా.. వారంరోజుల్లోనే 12 లక్షల మొక్కలు నాటడం విశేషం.

పోలీసుల్లో ఈ స్ఫూర్తిని నింపిన ఘనత సీఎం కే చంద్రశేఖర్‌రావుదేనని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ కమాండ్ ట్రైనింగ్ సెంటర్‌లో అదనపు డీజీపీలు, ఐజీలు, ఎస్పీలతో కలిసి ఆయన వంద మామిడి మొక్కలు నాటారు. కాగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మొక్కలను నాటేందుకు ఆర్థిక, ప్రణాళిక, పౌర సరఫరాల శాఖ కార్యాచరణ రూపొందించింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18న 40లక్షల మొక్కలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా 2.5కోట్లు, ఈ నెల 21న పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 40లక్షల మొక్కలను నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published.