హారీ దెబ్బకు అమెరికా విలవిల

వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు’’ అంటూ తూర్పు టెక్సాస్ వాసులకు ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాను హార్వే హరికేన్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా తూర్పు టెక్సాస్ పై హార్వే హరికేన్ విరుచుకుపడడంతో హూస్టన్‌ నగరం సముద్రాన్ని తలపిస్తోంది. వారం రోజుల్లో 132 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో రిజర్వాయర్లలో నీటిమట్టం 82 అడుగులకు చేరింది.

హార్వే తుపాను ధాటికి తెలుగు కుటుంబాలు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. హూస్టన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తుండగా వారిలో తెలుగువారే ఎక్కువ. తుపాను కారణంగా హూస్టన్ అతలాకుతలమవడంతో, నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, విద్యాసంస్థల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే సురక్షితంగా ఉన్న ఒక్కో కుటుంబమూ మరో రెండుమూడు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చింది. అక్కడి ప్రవాస భారతీయ హోటళ్లు ముందుకొచ్చాయి. ఒక్కో హోటల్ రెండువేల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా అన్నార్తులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.టేలర్‌ కౌంటీలోని నిషెస్‌, స్టీన్‌ హేగెన్‌ రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. ఈ గేట్లు ఎత్తేస్తే ఆ నీరు ఊళ్లను ముంచెత్తనుంది. దీంతో తక్షణం ఆ ఊళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అలా కాకుండా అక్కడే ఉంటే బతికే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశారు. కేవలం టెక్సాస్ లోనే 12 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశారు. 48,700 ఇళ్లు ధ్వంసమయ్యాయని, వెయ్యేళ్లకోసారి ఇలాంటి వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *