చాంపియన్స్‌ట్రోఫీకి టీమిండియా జట్టు ప్రకటన

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని 15 మంది ఆటగాళ్ల బృం దాన్ని సోమవారం జాతీయ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. జూన్‌ 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఎనిమిది దేశాలు పాల్గొంటుండగా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన జట్టునే దాదాపుగా ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆధ్వర్యంలోని సెలక్షన్‌ ప్యానెల్‌ ఎంపిక చేసింది. ఆ సిరీస్‌లో ఆడని రోహిత్‌ శర్మ, పేసర్‌ మొహమ్మద్‌ షమీ గాయాల నుంచి కోలుకోవడంతో తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో 2015లో జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ అనంతరం షమీ ఇప్పటిదాకా వన్డేల్లో ఆడలేదు. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్‌ గాయం కారణంగా తప్పుకున్నాడు. నలుగురు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు జట్టులో ఉండేలా చూశారు. భారత జట్టు తొలి మ్యాచ్‌ను 4న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది.

‘కుల్దీప్‌ గురించి చర్చించాం’
మనీష్‌ పాండేను అదనపు బ్యాట్స్‌మన్‌గా తీసుకోవడంతో పాటు కుల్దీప్‌ యాదవ్‌పై సెలక్షన్‌ కమిటీ లో తీవ్రంగా చర్చ జరిగిందని ఎమ్మెస్కే తెలిపారు. ‘కుల్దీప్‌ జట్టులో ఉంటే కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు. అయితే యువరాజ్, కేదార్‌ కూడా స్పిన్‌ బౌలింగ్‌ వేయగలరు. అందుకే అతడిని స్టాండ్‌బైగా ఉంచాల్సి వచ్చింది. ఇక దేశవాళీ పరంగా ఐపీఎల్‌ అద్భుత టోర్నీ అయినా వన్డే జట్టులో ఎంపికకు అందులోని ప్రతిభను పరిగణలోకి తీసుకోలేము. ఇంగ్లండ్‌ వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కాలంగా రాణిస్తున్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాం. గత నాలుగు నెలల నుంచి టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. అందుకే ఒకటి, రెండు స్థానాల్లో మార్పు తప్ప అదే జట్టును ప్రకటించాం’ అని ప్రసాద్‌ వివరించారు.

చర్చకు రాని గంభీర్‌ పేరు
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తున్న గౌతం గంభీర్ను చాంపియన్స్‌ ట్రోఫీలో తీసుకుంటారని ఆశించినా సెలక్టర్లు పట్టించుకోలేదు. అతడి పేరు కనీసం చర్చకు కూడా రాలేకపోయింది. సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు కూడా నిరాశే ఎదురైంది. గంభీర్‌ గురించి అడిగిన ప్రశ్నకు ‘రోహిత్, ధావన్‌ ఓపెనర్లుగా.. రహానే బ్యాకప్‌ ఓపెనర్‌గా ఉంటారు’ అని ప్రసాద్‌ తేల్చి చెప్పారు. అయితే గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన స్పిన్నర్‌ అశ్విన్‌ పేరును ఎందుకు పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించగా.. అతడి గాయంపై ఎలాంటి ఆందోళన లేదని, అతడికి విశ్రాంతి ఇవ్వాలన్న తమ కోరిను పుణే జట్టు గౌరవించిందని గుర్తుచేశారు.

జడేజాకు కూడా కావాలనే బ్రేక్‌ ఇచ్చామని అన్నారు. గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ అతడిని స్టాండ్‌బైగా ఉంచారు. తనతో పాటు యువ ఆటగాడు రిషబ్‌ పంత్, శార్ధుల్‌ ఠాకూర్, దినేశ్‌ కార్తీక్, కుల్దీప్‌ కూడా ఉన్నారు. వీరందరికి కూడా వీసాలు ఇస్తామని, బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేస్తారని ఎమ్మెస్కే తెలిపారు.

ధోనియే అత్యుత్తమం
భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని క్రికెట్‌ భవిష్యత్‌పై ఊహాగానాలను సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కొట్టివేశారు. ప్రపంచ క్రికెట్‌లో తనే అత్యుత్తమ వికెట్‌కీపర్‌ అని కొనియాడారు. యువ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను భవిష్యత్‌ తారగా పేర్కొన్నారు. ధోని ప్రస్తుత బ్యాటింగ్‌ ఫామ్‌ ఆందోళనే తప్ప కీపర్‌గా తనెప్పుడూ పొరపాట్లు చేయలేదని గుర్తుచేశారు. అతడి అపార అనుభవం కోహ్లికి ఉపయోగపడుతుందని అన్నారు.

జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రహానే, ధావన్, ధోని, రోహిత్, యువరాజ్, హార్దిక్‌ పాండ్య, కేదార్‌ జాదవ్, అశ్విన్, జడేజా, భువనేశ్వర్, ఉమేశ్‌ యాదవ్, మనీష్‌ పాండే, బుమ్రా, షమీ.
స్టాండ్‌బై: కుల్దీప్‌ యాదవ్, రిషబ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్, శార్దుల్‌ ఠాకూర్, రైనా.

Videos

Leave a Reply

Your email address will not be published.