ఇద్దరు చంద్రుల రహస్య భేటీ…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి వెళ్ళారు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడూ ఢిల్లీ బాట పట్టారు. ఇద్దరూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్నారు. పనిలో పనిగా పలువురు కేంద్ర మంత్రులతో ఇటు కేసీఆర్‌, అటు చంద్రబాబు భేటీ అవుతారనుకోండి.. అది వేరే విషయం.

త్వరలో తాను నిర్వహించనున్న ఆయత చండీయాగానికి సంబంధించి పలువురు ఢిల్లీ పెద్దల్ని కేసీఆర్‌ ఆహ్వానించనుండగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా ఢిల్లీలోనే ఆయత చండీయాగానికి ఆహ్వానం అందించాలని కేసీఆర్‌ అనుకుంటున్నారట. మరోపక్క, ఇద్దరు చంద్రులూ రహస్యంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ రహస్య భేటీకి ఓ కేంద్ర మంత్రి ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారమం.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో కేసీఆర్‌ని, అమరావతికి ఆహ్వానించేందుకు చంద్రబాబును ముందుకు నడిపింది ఆ కేంద్ర మంత్రేనట. ఇప్పుడు అదే కేంద్ర మంత్రి మరోమారు ఇద్దరు చంద్రుల్నీ ఒక్క చోట కూర్చోబెట్టి, ఇద్దరి మధ్యా విభేదాలు తగ్గి, ఇద్దరూ కలిసి ముందుకు నడిచేలా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అన్నట్టు, గతంలో సదరు కేంద్ర మంత్రి చేసిన ప్రయత్నాల కారణంగానే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు పెద్దగా తలదూర్చడంలేదు. అయితే, కేసీఆర్‌ మాత్రం యధాతథంగా ఆపరేషన్‌ ఆకర్ష ప్రోగ్రామ్‌ని నడిపించేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్‌ ఇరకాటంలో పడేస్తున్నారు. అయినా, చంద్రబాబు నోట, కేసీఆర్‌పై విమర్శలే రావడంలేదు ఇటీవలి కాలంలో. అంతా సదరు కేంద్ర మంత్రి కుదిర్చిన సయోధ్య ఫలితమేనట. ఈసారి భేటీలో కేసీఆర్‌పై, సదరు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసే ఆలోచనలో చంద్రబాబు వున్నట్లు తెలుస్తోంది.

అయినా, చంద్రబాబేమీ ఆషామాషీ రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో తలపండిన వ్యక్తి. పైగా, కేసీఆర్‌ రాజకీయాల్లో చంద్రబాబుకి జూనియరే. కానీ, రోజులెప్పుడూ ఒకేలా వుండవ్‌ కదా. ఓటుకు నోటు కేసు తర్వాత కొన్నాళ్ళు హడావిడి చేసినా, ‘ఇది సంధి కాలం.. ఏమీ చేయలేం..’ అన్న నిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు. చంద్రబాబుతో పోల్చితే కేసీఆర్‌, తాను చెయ్యాలనుకున్న పనులు చేసేస్తున్నా, చంద్రబాబుపై ఇదివరకటి ‘వేడి’ ప్రదర్శించడంలేదనే చెప్పాలి.

మొత్తమ్మీద, ఇద్దరు చంద్రులూ ఢిల్లీలో కలుసుకోవడం మాత్రం ఖాయం. అయితే రహస్య భేటీ కుదురుతుందా.? లేదా.? కుదిరితే, రహస్య భేటీలో జరిగే నిర్ణయాలు ఎలా వుంటాయి.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Videos

89 thoughts on “ఇద్దరు చంద్రుల రహస్య భేటీ…

Leave a Reply

Your email address will not be published.