పసికూనలపై గెలిచిన ధోనీ సేన

ఇప్పటి వరకు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన భారత బౌలర్లు… వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. పటిష్టమైన ప్రత్యర్థి కాకపోయినా… కట్టుదిట్టమైన బౌలింగ్‌తో యూఏఈని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత్ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ (28 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో… గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేసింది.  షైమాన్ అన్వర్ (48 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. పచ్చిక వికెట్‌పై ఆరంభంలో భువనేశ్వర్, బుమ్రాలు చెలరేగితే.. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. పరుగులు నిరోధించడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దీంతో భాగస్వామ్యాలు నమోదు చేయడంలో యూఏఈ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఓవరాల్‌గా ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం స్కోరుపై తీవ్ర ప్రభావం చూపింది. భువనేశ్వర్ 2 వికెట్లు తీశాడు.

ఆ తర్వాత అతి స్వల్ప లక్ష్యాన్ని భారత ఒక వికెట్‌ కోల్పోయి మరో 59 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్‌ రోహిత శర్మ (39)తో పాటు శిఖర్‌ ధవన (16 నాటౌట్‌), యువరాజ్‌ సింగ్‌ (25 నాటౌట్‌) రాణించారు. చివరి పది టీ20ల్లో ధోనీసేనకిది తొమ్మిదో విజయం కావడం విశేషం. రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇక ఆదివారం టైటిల్‌ పోరులో బంగ్లాదేశతో భారత తలపడనుంది. స్వల్ప లక్ష్య ఛేదన భారతకు నల్లేరుపై నడకే అయింది. తొలి మూడు ఓవర్లలో యూఏఈ పేసర్లు లైన్ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేయడంతో ఓపెనర్లు రోహిత్, ధావన్ ఆచితూచి ఆడారు. జావెద్‌ వేసిన 4వ ఓవర్‌లో రోహిత్ 4, 6, 4తో హిట్టింగ్‌ మొదలు పెట్టాడు. తర్వాతి ఓవర్‌లోనూ అతను రెండు బౌండ్రీలతో జోరు ప్రదర్శించాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ అదే ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. రోహిత్ వెనుదిరిగిన తర్వాత ధావన్‌తో యువరాజ్‌ జతకలిశాడు. యువరాజ్ సింగ్ ఎదుర్కొన్న రెండో బంతినే బౌండ్రీ తరలించి ఆత్మవిశ్వాసం కూడదీసుకున్నాడు. అహ్మద్‌ బౌలింగ్‌లో ధవన కూడా రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. తర్వాత యువరాజ్‌ 4, 6, 4తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇక షెహజాద్‌ వేసిన 11వ ఓవర్‌లో యువీ బౌండ్రీతో ఫినిషింగ్‌ టచ్ ఇచ్చాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *