ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఇండియా విజయం

ఊహించినట్లే రెండో టెస్ట్‌లో శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ స్కోరుతో టీమిండియా ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. గ‌తంలో 2007లో బంగ్లాదేశ్‌పై కూడా స‌రిగ్గా ఇన్నింగ్స్ 239 ప‌రుగుల తేడాతోనే ఇండియా గెలిచింది. నాలుగో రోజు లంచ్ తర్వాత కాసేపటికే లంక రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు కుప్పకూలింది. అశ్విన్ 4, ఇషాంత్, జడేజా, ఉమేష్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. చివరి వికెట్ తీసి టీమిండియాను గెలిపించిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో 3 టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లి సేన 1-0 లీడ్‌లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 205 పరుగులు చేయగా.. భారత్ 6 వికెట్లకు 610 పరుగుల భారీ స్కోరు దగ్గర డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. కోహ్లి (213) డబుల్ సెంచరీ చేయగా.. విజయ్, పుజారా, రోహిత్ సెంచరీలు చేశారు.

చండిమాల్‌-లక్మల్‌ ప్రతిఘటించినా..

ఈ రోజు ఆటలో ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్‌ ప్రారంభించిన లంకేయులు పోరాడటంలో పూర్తిగా విఫలమయ్యారు.  75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లంకేయలు..107 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయారు. కాగా, తొమ్మిది వికెట్ కు లంక దాదాపు గంట పోరాడటం ఆకట్టుకుంది. చండిమాల్‌-లక్మల్‌ జోడి కాసేపు మరమ్మత్తులు చేసింది. ఈ జోడి 58 పరుగులు జోడించి లంక స్కోరు బోర్డును చక్కదిద్దే యత్నం చేసింది. కాగా, చివరి రెండు వికెట్లను లంక పరుగు వ్యవధిలో కోల్పోవడంతో ఇన్నింగ్స్‌ ముగిసింది.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 205 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌​ 166 ఆలౌట్‌

భారత్‌ తొలి ఇన‍్నింగ్స్‌​  610/6  డిక్లేర్‌

Videos

Leave a Reply

Your email address will not be published.